సిరా న్యూస్,శ్రీకాకుళం;
టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పలు ప్రభుత్వ కార్యాలయాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. సిబ్బందిపై ఆరా తీశారు. మొదటిసారిగా క్షమించి వదిలేస్తున్నాను.. ప్రజలు ఎవరైనా సరే ఇబ్బందులు పడ్డారని తన దృష్టికి వస్తే మాత్రం క్షమించేది లేదన్నారు. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కాదు.. ప్రజల కోసం మాత్రమే పని చేస్తుందన్నారు. ఏ అధికారైనా సరే ఆఫీస్ పనులు నిమిత్తం బయటకు వెళితే పరవాలేదు, వ్యక్తిగత పనులకు మాత్రం ఊరకనే వెళ్తే మాత్రం తాను రంగంలో దిగవలసి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడైతే అచ్చెన్నాయుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరిగెత్తారు, ఇక అధికారులు పరుగులు పరుగున అక్కడికి చేరుకొని.. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సమస్యలపై ఆయనకు వివరించారు. ఇక మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వెంటనే దాన్ని పరిష్కరించాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. మంత్రి తన పర్యటనలో భాగంగా టెక్కలి ప్రభుత్వ అసువత్రి వద్ద నూతన మార్చరీ రూమ్, వేస్టేజ్ స్టోర్రూమ్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్కు, ఇంజనీరింగ్ భాగం అధికారులకు, కాంట్రాక్టర్లకు సోమవారం నుంచి పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఎక్కడా రాజీపడకుండా వైద్య రంగానికి ప్రభుత్వం తగిన సహ కారం అందిస్తున్నట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ పేదలు అందించే వైద్యసేవలపై నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.వైద్యులు తమ విధులను మరింత బాధ్య తతో నిర్వహించాలని, చిన్న పాటి నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదని సూచించారు. రోగులను నవ్వుతూ పలకరించాలన్నారు. కోవిడ్19 సమయంలో మంచి సేవలు అందించినందుకు అభినందిస్తూనే, వైద్యులు తమ బాధ్యతను మరవకుండా మరింతగా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విధుల్లో ఉదాసీనత ఉండకూడదని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో లిఫ్ట్ పని చేయకపోవడం, రోగులు ఇబ్బందులు పడు తున్నట్లు తెలిసిందని దానిపై ఆసుపత్రి సూపరింటెండెంటును మంత్రి అచ్చెన్నాయుడు వివరణ కోరగా వర్క్ లోడ్ వల్ల సుమారు 20 నిమిషాల పాటు పని చేయలేదని తెలుపగా.. మంత్రి తక్షణం స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వం ఆసుపత్రికి పక్కనే ఉన్న మత్స్య శాఖ కార్యాలయం దారిలో గోశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి సరిహద్దులు వెయ్యాలన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి శూన్యమని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి ఎక్కడా కానరాలేదని, రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసి ఐదేళ్లపాటు బీమాను కూడా చెల్లించని ప్రభుత్వం అని అచ్చె న్నాయుడు అన్నారు. మంత్రి తన పర్యటనలో భాగంగా టెక్కలి గ్రామ పంచాయతీ కార్యాలయంలోఅధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇంటి పన్నులు, తాగునీటి సమస్యల పరిష్కారం, పశువుల సంచారం లేకుండా చర్యలు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ, పారిశుధ్య కార్మికుల సమస్యలు తదితర అంశాలపై ఆరాతీసి సంబంధిత అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఇంటి పన్నును సకాలంలో వసూలు చేయా లని సూచించారు. సిబ్బంది సక్రమంగా పనిచేయాలని, అసెస్మెంట్ లేనివారు తక్షణమే వేయించుకోవాలని హితవు పలికారు. టెక్కలి పట్టణం అత్యంత సుందరీ కారణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. త్వరలో సులభ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సి.ఎస్.ఆర్ నిధుల నుంచి నిర్మాణం చేపడతామని అన్నారు. బాధ్యతగా పనిచేస్తే మన లక్ష్యానికి చేరుకుంటామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు.