బుద్దవనంలో అభివృద్దికి చర్యలు

పరిశీలించిన మంత్రి జూపల్లి
సిరా న్యూస్,నల్గోండ;
నాగార్జునసాగర్, బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
శుక్రవారం అయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనం పరిసర ప్రాంతాలను శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కమలేష్ డి.పాటిల్ (దాజి )తో కలిసి పరిశీలించారు. ముందుగా విజయ విహర్ లో బుద్ధవనం లే-అవుట్ ,విజయ విహార్ లేఔట్లను పరిశీలించారు .మొత్తం 270 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న బుధవనంలో ఉన్న విశేషాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి .ప్రకాష్ రెడ్డి , బుద్ధవనం కన్సల్టెంట్ శివనాగిరెడ్డిలు మంత్రికి,దాజికి వివరించారు. నాగార్జునసాగర్ ,బుద్ధవనానికి ఆసియా ఖండంలోని పలు దేశాల నుండి బౌద్ధులు ఇక్కడికి వస్తారని ,ప్రత్యేకించి శ్రీలంక, ఇతర ఆసియా ఖండాల నుండి ఎక్కువ మంది వస్తారని ,వారికి అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించాల్సి ఉందని ,అప్పుడు ఇంకా ఇతర దేశాల నుండి సైతం బౌద్ధులు ఇక్కడికి వచ్చేందుకు అవకాశం ఉందని మంత్రి అన్నారు. బుద్ధవనం పరిసర ప్రాంతాలతో పాటు, విజయ విహార్ లో ఉన్న స్థలం వివరాలు, అలాగే నాగార్జునసాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించి వివరాలు సమర్పించాలని ఈ సందర్భంగా మంత్రి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు.
అనంతరం మంత్రి, దాజితో కలిసి బుద్ధవనం పక్కన ఉన్న విపస్యన ధ్యాన కేంద్రం పరిసర ప్రాంతాలను, ఇతర ప్రదేశాలను పరిశీలించారు . ఆ తర్వాత స్థానిక శాసనసభ్యులు కె.జయవీర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నాగార్జున సాగర్ ను అభివృద్ధి చేసేందుకు, ప్రత్యేకించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పర్యటకశాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బుద్ధవనం చూడడానికి ప్రపంచంలోని ఇతర దేశాల నుండి ఆషియా దేశాల నుండి ఎంతోమంది భౌద్దులు ,ఇతరులు వస్తున్నారని,ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా సౌకర్యాలను కల్పించేందుకు, ముఖ్యంగా బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లో వాటర్ స్పోర్ట్స్ ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ సమీపంలో ఉన్న రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాజితో కలిసి సందర్శించినట్లు తెలిపారు .స్టార్ హోటల్, వాటర్ స్పోర్ట్స్ తో పాటు, ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా కాటేజీల నిర్మాణాన్ని చేపట్టనున్నామని, నాగార్జునసాగర్ తో పాటు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం పెద్ద ఎత్తున టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు విజయ్ విహార్ లో స్థానిక శాసనసభ్యులు కే.జయవీర్ మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రత్యేకంగా కృష్ణా నది సమీపంలో ఉండడం ,కొండలు ,ఇక్కడ పరిసరాలు ,బుద్ధవనం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంచి ఆస్కారం ఉందన్నారు . రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎం డి ప్రకాష్ రెడ్డి,ఓఎస్ డి. సూధన్ రెడ్డి, బుద్ధిష్ట్ కన్సల్టెంట్ శివనాగిరెడ్డి, బుద్ధవనం డిజైనర్, ఇంచార్జ్ శ్యాంసుందర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *