13 జోన్లుగా అమరావతి

– తొలిదశలో ఆరుజోన్లలో 12894 ఎకరాల అభివృద్ధి
– సీడ్ ఏరియాకు ప్రాధాన్యత
– రెండుజోన్లలో ప్రభుత్వ భవనాలు

సిరా న్యూస్,అమరావతి :
ఏపీ రాష్ట్ర రాజధాని నగరం అమరావతి అభివృద్ధిలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం నవ నగరాలుగా ఉన్న అమరావతి నగరాన్ని 13 జోన్లుగా ప్రభుత్వం విభజించింది. దీనిలో ఆరు జోన్లను ప్రాధాన్యత జోన్లుగా గుర్తించింది.

అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్ ఏరియాను రెండు జోన్లుగా విభజించారు.

మొత్తం ఆరు జోన్లలో 12,894 ఎకరాలను తొలిదశలో అభివృద్ధి చేయనున్నారు. దీనిలో అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్(ఎజిసి)కి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. . తాజాగా నిర్ణయించిన జోన్ల విధానంలో ఒకటి నుండి 12 జోన్లు ఏర్పాటు చేసి మరొక జోన్ను 12ఏగా పేర్కొన్నారు. నెదర్లాండ్స్ సహకారంతో కాలువలు, రిజర్వాయర్లు నిర్మించాలనుకున్న ప్రాంతమంతా ప్రాధాన్యత జోన్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధి చేయానుకున్న జోన్లలో 1,2,3,6,7,10జోన్లు ఉన్నాయి. వీటిల్లో ఒకటీ రెండు జోన్లు అనంతవరం, శాఖమూరు పరిధిలో ఉండగా అక్కడ క్రీడా పాలసీని అమలు చేయనున్నారు. ఈ రెండు జోన్లలో కలిపి 4237.34 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే మూడు, ఆరు జోన్లు శాఖమూరు, కొండమరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం పరిధిలో ఉన్నాయి.

ఇది వాటిల్లో ప్రతిపాదిత ఎజిసి నిర్మించనున్నారు. 4241.57 ఎకరాల పరిధిలో ఈ జోన్లు విస్తరించి ఉన్నాయి. ఏడో జోన్లో లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, మందడం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం ఉన్నాయి. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇది 2060.13 ఎకరాల్లో ఉంది.

పదోజోన్ పరిధిలో నీరుకొండ, ఐనవోలు, కురగల్లు ప్రాంతాలున్నాయి. ఇక్కడ రిజరాయర్లు, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పదో జోన్ మొత్తం 2355.52 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది.
వీటిల్లో ఆరోజోన్ పరిధిలో పాలవాగు రిజర్వాయర్, పదోజోన్ పరిధిలో కొండవీటివాగు రిజర్వాయర్ నిర్మించనున్నారు. వీటికితోడు అమరావతి సీడ్ డెవలప్మెంట్ ఏరియాను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారు. త్వరలోనే వీటికి సంబంధించి టెండర్లు పిలవనున్నారు. వీటిల్లోనే శాకమూరు చెరువును కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే నీరుకొండకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో గతంలో మాస్టర్ప్లానులో పేర్కొన్న విధంగా పార్కులు అభివృద్ధి చేస్తామని, ఎజిసికి సమాంతంగా రెండువైపులా పార్కులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే వాటర్బాడీస్ కూడా ఈ జోన్లోనే ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వీటిల్లో ముఖ్యంగా రిజర్వాయర్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నామని, అలాగే గ్రావిటీ కెనాల్స్నూ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *