సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అమరావతికి మించి మరే ప్రయారిటీ లేదు. దానిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ఐదేళ్లలో అమరావతిని ఒక దశకు తేవాలన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తుంది. అమరావతి తర్వాతే ఆయనకు ఏదైనా.. అలా ముందుకు సాగుతున్నారు. అమరావతిలో పనులు పరుగులు పెట్టించాలన్న భావనతో ఉన్న చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ప్రపంచ బ్యాంకు నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు అవుతాయని చెప్పడంతో ఇక టెండర్లను పిలిచేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమయింది. అందుకు సీఆర్డీఏ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 36 కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిలో చెట్లను తొలగించారు. ముళ్లపొదలన్నింటినీ క్లియర్ చేసేసి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచారు. అయితే ఇప్పుడు భవనాల నిర్మాణాలను అత్యవసరంగా ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రతి రోజూ మున్సిపల్ శాఖ, సీఆర్డీఏ అధికారులు వెంట పడుతూ అమరావతి పనులను సమీక్షిస్తున్నారంటే ఎంత ప్రిస్టేజ్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. ప్రపంచబ్యాంకు నిధులతో అమరావతిలో కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంతో పాటు ఉన్నతాధికారుల క్వార్టర్ల ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేసి తొలి దశ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నిధుల కోసం వెయిట్ చేయకుండా ముందుగా హడ్కో నుంచి పదకొండు వేల రూపాయలు రుణం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు సాయంత్రం హడ్కో ఛైర్మన్ తో ఆయన సచివాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అమరావతి నిర్మాణం కోసం పదకొండు వేల రూపాయలు రుణాన్ని చంద్రబాబు అడగనున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు అటు ప్రపంచ బ్యాంకు నిధులు పదిహేను వేల కోట్లు, ఇటు హడ్యో నిధులు పదకొండు వేల కోట్ల రూపాయలతో కలసి మొత్తం 26 వేల కోట్ల రూపాయల నిధులతో అమరావతిలో నిర్మాణాల వేగం పెంచాలని నిర్ణయంలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రైల్వే లైన్ ను కేటాయించడం తమకు మరింత అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద నగరంగా, అత్యాధునిక వసతులతో కూడిన రాజధానిగా నిర్మాణం చేయాలన్న తపన చంద్రబాబులో కనిపిస్తుంది. చంద్రబాబు ప్రస్తుతం కసిమీద ఉన్నట్లే అనిపిస్తుంది. అందుకే అమరావతి కోసం ఆయన ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి కూడా వెనకాడటం లేదు. అదే రాష్ట్రానికి సంపదను తెచ్చిపెడుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. తన హయాంలోనే అమరావతి నిర్మాణం పూర్తయి చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇందులో తప్పేమీ లేదు కానీ.. నిధులన్నీ అమరావతికే వెచ్చిస్తే అప్పులు తెచ్చి అమరావతిని అందంగా తీర్చి దిద్దితే.. సంక్షేమ పథకాల సంగతి ఏంటన్న ప్రశ్న కూడా ప్రశ్న గానే మిగులుతుంది.