అంబటి, పేర్ని లే వాయిస్ లా..

 సిరా న్యూస్,గుంటూరు;
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత లీడర్ల గొంతులు మూగబోయాయి. కనీసం పార్టీ తరుపున మాట్లాడేందుకు నేత కూడా లేరు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, అధికార ప్రతినిధులు, ప్రత్యేక సలహాదారులు ఇలా మూకుమ్మడిగా చుట్టుముట్టేవారు. అప్పటి ప్రతిపక్షంపై విరుచుకుపడే వారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎందరో నేతలు క్యూ కట్టేవారు. అవతలి వారి నోటిని కట్టిపడేసేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలు మాత్రమే తరచూ కనిపిస్తున్నారు. అధికార పార్టీ చేసే విమర్శలకు వారిద్దరు మాత్రమే సమాధానం చెబుతున్నారు. మిగిలిన నేతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరగుతుంది. అధికారంలో లేనప్పుడు కూడా… ఒకరు పేర్ని నాని. మాజీ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన దాదాపు ప్రతిరోజూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి దుమ్ము దులిపేవారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఇలా ఎవరినీ వదలిపెట్టకుండా విమర్శించేవారు. పేర్ని నాని సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకుని మరీ నిఖార్సయిన జవాబిచ్చేవారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కూడా ఆయన మైకును వదలలేదు. ఇక గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడికి అవకాశమివ్వాలని కోరగా జగన్ అందుకు అంగీకరించారు. అయితే పేర్ని కిట్టు గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత కూడా విపక్షంలోకి వచ్చిన తర్వాత సూటిగా, సుత్తిలేకుండా అధికార పక్షానికి సమాధానమిస్తున్నారు.జగన్ ను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి కార్యకర్తల పరాిమర్శ వరకూ పేర్ని నాని యాక్టివ్ గా ఉన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనిది రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని పేర్ని నాని తెలిపారు. తాను తొలి నుంచి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానని, ఆయన తనయుడు వైఎస్ జగన్ తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని చెప్పారు. రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానన్న పేర్ని నాని ఎన్నికలలో ఓటమి తర్వాత మాత్రం ఆ ఆలోచనను విరమించుకున్నారు. మచిలీపట్నం మాత్రమే కాకుండా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మరీ దాదాపు ప్రతి రోజూ అధికార పక్షానికి కౌంటర్ ఇస్తున్నారు. దీంతో వైసీీపీ క్యాడర్ కూడా పేర్ని నానిని సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతుంది. ఒక మరో నేత అంబటి రాంబాబు. ఆయన కూడా మాజీ మంత్రిగా ప్రస్తుతం వైసీపీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. ప్రధానంగా పోలవరంతో పాటు పోలింగ్ శాతం, ఈవీఎంలు ఇలా అనేక విషయాలపై తక్షణమే స్పందిస్తున్నారు. అంబటి రాంబాబు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన అధినేతలను తూర్పారపట్టేవారు. ఇరిగేషన్ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు అనేక అంశాలపై ఇప్పటికీ యాక్టివ్ గా స్పందిస్తున్నారు. ఇద్దరు నేతలు తొలి నుంచి వైఎస్ జగన్ వెంట నడిచిన వారే. ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన వారే. జగన్ సామాజికవర్గానికి చెందిన నేతలు ఎవరూ పెదవి విప్పక పోయినా వీరిద్దరూ వైసీపీకి మైకులుగా మారి కొంతవరకూ పార్టీని కొంత మేర ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *