సిరా న్యూస్,ఒంగోలు;
గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను ఇక పోటీ చేయనని ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. అనారోగ్య కారణాలతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని అసలు రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అన్నా రాంబాబు నిర్ణయం సంచలనంగా మారింది. తనను వైసీపీలో రెడ్డి సామాజికవర్గం పూర్తిగా అన్యాయం చేసిందని టీడీపీలో చేరాలని అనుకుంటున్నానని ఆయన తన అనుచరులతో చెప్పినట్లుగా రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించారు.
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అలా అంటున్నారని ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అన్నా రాంబాబు విజయం సాధించారు. ఆయనకు 81 వేల మెజార్టీ వచ్చింది. 2009లో ప్రజారాజ్యం తరపున అన్నా రాంబాబు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి విజయం సాధించారు. టీడీపీలో ఉన్న అన్నా రాంబాబు తర్వాత వైసీపీలో చేరి ఆ పార్టీ టిక్కెట్ పై గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. కానీ జిల్లాలోని వైసీపీ నేతలతో ఆయనకు సరి పడలేదని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతోంది. పార్టీలో ముఖ్య సామాజికవర్గం తనను లక్ష్యంగా చేసుకుందని.. ఆ సామాజికవర్గం నన్ను చాలా ఇబ్బందులు పెట్టిందని ఆయన ఆరోపిస్తున్నారు. జిల్లా పార్టీ నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం అయితే ఆయన మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దని..మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తానని రాంబాబు చెప్పుకొచ్చారు. గిద్దలూరలో ఈ సారి అన్నా రాంబాబాబుకు టిక్కెట్ ఇవ్వడం లేదని ఇప్పటికే వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనే రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. బాలినేని కాకపోతే.. మాగుంట శ్రీనివాసులరెడ్డి లేదా ఆయన కుమారుడ్ని బరిలోకి దించాలనుకుంటున్నారు. అందుకే అన్నా రాంబాబుకు టిక్కెట్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది.