విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు
సిరా న్యూస్,ఖమ్మం;
తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు న్యాయవిచారణ కమిషన్ గుర్తించింది. ఈ మేరకు కమిషన్ నివేధిక సిద్ధం చేయగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేడు అంశాలలో ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించగా ప్రభుత్వ ఖజానాపై భారం పడిందని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొనుగోలులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయి? బాధ్యులు ఎవరు అనే అంశాలను సైతం నివేధికలో పొందుపర్చినట్టు సమాచారం. నివేధికలోని అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.మంత్రి వర్గ సమావేశంలో సైతం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయట. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలలోనూ ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ సర్కార్ ఛత్తీస్ గడ్ తో జరిపిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో లోపాలు ఉన్నాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ నాయకులు విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని విచారణ జరిపించాలని పలుమార్లు డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల తరవాత తమ ప్రభుత్వమే కొలువుదీరడంతో కమిషన్ వేసి విచారణ ప్రారంభించారు.హైకోర్టు మాజీ జడ్జి ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్ ను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల విచారణ తుదిదశకు చేరుకున్న తరవాత నరసింహారెడ్డిని మార్చాల్సి వచ్చింది. ఆ తరవాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లోకూర్ ను న్యాయ విచారణ కమిషన్ ఛైర్మన్‌గా నియమించారు. ఇక విచారణ పూర్తి చేసిన లోకూర్ కమిటీ అక్టోబర్ 29న నివేధికను ఇంధనశాక కార్యదర్శికి అందజేసింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మరికొందరి పేర్లను ఈ నివేధికలో పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు నివేధికను బట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.