సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో రియల్ భూం కొన్ని కంపెనీలకు కాసుల పంట కురిపిస్తోంది. వివాదాస్పద భూముల్లో పాగా వేయడం, కస్టమర్లకు అంటగట్టి తప్పించుకోవడం షరా మామూలే. కొన్ని కంపెనీలు అయితే ప్రీలాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తాయి. దీనికి చక్కటి ఉదాహరణ సాహితీ ఇన్‌ఫ్రా. సామాన్యుల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని ప్రీలాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. వాటిలో అన్విత బిల్డర్స్ ఒకటి. తాజాగా ఈ కంపెనీకి సంబంధించిన ఆఫీసులు, ఓనర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలకు దిగడంతో ఈ కంపెనీ వ్యవహారాలపై చర్చ జరుగుతోంది.అన్విత బిల్డర్స్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. వచ్చిన ఆదాయానికి చెల్లించిన పన్నులకు మధ్య భారీగా తేడాలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు భారీగా పన్ను ఎగవేసినట్టు కూడా తేలింది. అన్విత బిల్డర్స్ కార్యాలయాల్లో భారీగా రికార్డులను సీజ్ చేశారు. జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్‌పేట్, కొల్లూరులోని ఎండీ బొప్పన అచ్యుతరావు, డైరెక్టర్ బొప్పన అనూప్ ఇళ్లు, ఆఫీసుల్లో ఈ సోదాలు చేశారు అధికారులు. సింగపూర్, దుబాయ్‌లో ఇంటీరియర్ బిజినెస్ ద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదించినట్టు గుర్తించారు అధికారులు. అసలు ఈ కంపెనీకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై యాజమాన్యం, డైరెక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు కూడా తేల్చినట్టు తెలుస్తోంది.నిజానికి అన్విత బిల్డర్స్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. బాచుపల్లి లో భువి రెసిడెన్సీ పేరుతో 2021లో ఓ చిన్న ప్రాజెక్ట్ చేపట్టగా, అది 2023లో పూర్తి చేసింది. తర్వాత కొల్లూరుపై కన్నేసింది. అన్వితా ఇవానా, అన్విత హై9 పేరుతో దశల వారీగా ప్రాజెక్టులు చేపట్టింది. అలాగే అన్విత అమరి, అన్విత కమర్షియల్ పేర్లతో మొత్తం 60 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టింది. ఇవన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. కానీ, ప్రీలాంచ్ పేరుతో ముందుగానే డబ్బులు వసూలు చేసింది. ఇవానా ప్రాజెక్టును 22.15 ఎకరాల్లో రెండు దశల్లో పూర్తయ్యేలా చేపట్టింది. మొదటి దశలో 12.9 ఎకరాల్లో 15 అంతస్తుల్లో రెండు టవర్ల నిర్మాణం ఉంటుందని, 2024 డిసెంబర్‌కు పూర్తి చేస్తామని చెప్పింది. రెండో దశలో 9.25 ఎకరాల్లో 36 అంతస్తుల్లో 4 భారీ టవర్లను నిర్మిస్తామని, 2027లో దీన్ని పూర్తి చేస్తామని కస్టమర్లను నమ్మించింది. ఇది రూ.2వేల కోట్ల మెగా ప్రాజెక్ట్. ఇంత మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది పెద్ద ప్రశ్న. ప్రీలాంచ్ పేరుతో కొంత వసూళ్లు చేసినా, ఇంకా ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతోంది. త్వరలో నీలాద్రి ఫామ్స్ పేరుతో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్‌నూ చేపడుతున్నట్టు చెప్పింది. ఇక, సంస్థ డైరెక్టర్ బొప్పన అనూప్ అనేక కంపెనీల్లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. చిన్న వయసులోనూ ఇన్ని సంస్థల్లో కీలకంగా వ్యవహరించడంతో ఐటీ శాఖకు అనేక అనుమానాలు కలిగాయి. దీంతో సోదాలకు దిగింది. కీలక విషయాలు వెలుగుచూశాయి.