జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సిరా న్యూస్,భూపాలపల్లి;
పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఐ డి ఓ సి కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోలు ప్రక్రియపై మార్కెటింగ్, సహకార, సిసిఐ, పోలీస్,అగ్నిమాపక, వ్యవసాయ కాటన్ మిల్లుల యజమానులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పత్తి కొనుగోలు ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభం అవుతున్నదని సిసిఐ ద్వారా కొనుగోలు చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నవంబర్ మొదటి వారం నుండి పత్తి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని తెలిపారు. జిల్లాలో 93 వేల ఎకరాలలో పత్తి సాగు జరిగిందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు సజావుగా, సక్రమంగా సాగేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో ఐదు పత్తి మిల్లులు ఉన్నాయని రైతులు విక్రయాలు చేసేందుకు దగ్గరలో ఉన్న మిల్లులకు ట్యాగింగ్ చేయాలని తెలిపారు. కొనుగోలు చేసిన పత్తి నిల్వ ఉంచేందుకు గోదాములను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 25 వ తేదీ వరకు పత్తి కొనుగోళ్ళు ప్రారంభించాలని ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనుగోలు జరపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సీసీఐ ద్వారా మాయిచ్చర్ మిషన్, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీస్ శాఖకు సూచించారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో స్థానిక పోలీస్ అధికారుల నెంబర్లు, అత్యవసర నంబర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. తూనికలు కొలతలు శాఖ ద్వారా ప్రతి కొనుగోలు కేంద్రాలలో కాంటాలకు స్టాంపింగ్ చేయాలని ఆదేశించారు. గోదాములు, మిల్లుల వద్ద అగ్నిపాక శాక ద్వారా అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కనక శేఖర్, ఆదనపు ఎస్పీ బోనాల కిషన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సందాని, వ్యవసాయశాఖ అధికారి విజయ భాస్కర్,జిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు