సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని మహిళను దుండగులు హతమార్చి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ కోర్టు సమీపంలోని ఇళ్ల మధ్య గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కాలనీవాసులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న గుర్తు తెలియని మహిళను కొందరు దుండగులు ఎక్కడో హత్య చేసి పట్టణంలోని శ్రీనివాస కాలనీలోని ఇళ్ల మధ్య పడేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ కవర్‌లో మృతదేహాన్ని చుట్టి ఉంచారని చెప్పారు. మృతురాలికి పసుపు రంగు దుస్తులున్నాయని.. ఆమె 2 చెవులు కత్తిరించి చెవి కమ్మలు తీసేసిన ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్ నగర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.
అటు, రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ (27) శనివారం తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడి స్వస్థలం మంచాల మండలంగా గుర్తించారు. కానిస్టేబుల్ విధుల్లో ఉండగానే ఇలా చేయడం తీవ్ర కలకలం రేపింది. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.