సిరా న్యూస్,హైదరాబాద్,;
‘దసరా’ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా ‘హాయ్ నాన్న’. దసరా మాస్ అయితే… హాయ్ నాన్న క్లాస్! ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘బేబీ’ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించింది. మనసుకు హాయినిచ్చేలా ప్రచార చిత్రాలు, పాటలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది.
నాని ముంబైలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అతని ఆరేళ్ళ కుమార్తె పేరు మహి (‘బేబీ’ కియారా ఖన్నా). పాపకు కథలు చెప్పడం తండ్రి అలవాటు. అమ్మ కథ చెప్పమని ప్రతిసారీ అడుగుతూ ఉంటుంది. క్లాస్ ఫస్ట్ వస్తే చెబుతానని మదర్ ప్రామిస్ చేస్తాడు విరాజ్. మహి ఫస్ట్ వస్తుంది. కానీ, అమ్మ కథ చెప్పడు. తెల్లారిన తర్వాత తండ్రికి చెప్పకుండా మహి బయటకు వెళుతుంది. ఆ చిన్నారిని ఓ ప్రమాదం నుంచి యష్ణ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. ఇద్దరు కలిసి కాఫీ షాపులో కూర్చుంటారు. అక్కడికి విరాజ్ వస్తాడు. కంపల్సరీ అమ్మ కథ చెప్పాలని పట్టుబట్టడంతో మరో దారి లేక చెప్పడం మొదలు పెడతాడు. విరాజ్ పెద్ద ఫోటోగ్రాఫర్ కాకముందు… అతడికి వర్ష (ఆ పాత్రలో యష్ణను మహి ఊహించుకుంటుంది – అంటే మృణాల్ ఠాకూర్) పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. వర్ష సంపన్నురాలు. విరాజ్ మిడిల్ క్లాస్. తల్లి చెబుతున్నా వినకుండా విరాజ్ ఇంటికి వస్తుంది. పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళకు ఓ అందమైన పాప జన్మిస్తుంది. విరాజ్ కథ చెబుతుంటే అతడు ప్రేమించిన అమ్మాయి పాత్రలో తనను తాను ఊహించుకుంటుంది యష్ణ. విరాజ్‌ను ప్రేమిస్తుంది. అసలు… పాప జన్మించిన తర్వాత ఏమైంది? విరాజ్, వర్ష ఎందుకు విడిపోయారు? వర్ష ఎక్కడికి వెళ్ళింది? వర్ష కుటుంబ నేపథ్యం ఏమిటి? తల్లిదండ్రులు ఎవరు? ఓ వారంలో అరవింద్ (అంగద్ బేడీ)తో పెళ్లి పెట్టుకుని విరాజ్‌తో ప్రేమలో పడిన యష్ణ… అతడికి తన మనసులో మాటను చెప్పిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తండ్రి కుమార్తె అనుబంధం, ఇద్దరి మధ్య ప్రేమ నేపథ్యంలో తెలుగు తెరకు కొత్త కాదు. తల్లి లేని కుమార్తెను ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిని చూసి మనసు ఇచ్చిన అమ్మాయిల కథలు కూడా కొత్త కాదు. ఆల్రెడీ వచ్చిన కథల మధ్య ‘హాయ్ నాన్న’ను కొత్తగా నిలబెట్టిన అంశం ఏది? అని చూస్తే… తల్లి పాత్ర!’హాయ్ నాన్న’లో కథానాయకుడు, కుమార్తె కంటే తల్లి పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్, ఆ ట్విస్ట్ చుట్టూ నడిచే సీన్లు కూడా! బహుశా… నానికి కూడా ఆ పాయింట్ నచ్చి కథ ఓకే చేశారేమో!? అయితే… ఆ ట్విస్ట్ వచ్చే వరకు నడిచే ప్రేమకథ రెగ్యులర్ & రొటీన్ అనిపిస్తుంది. ఒక దశలో ‘సారొచ్చారు’ ఛాయలు సైతం కనిపిస్తాయి. మధ్యలో పాటలు కాస్త ఉపశమనం ఇస్తాయి. ఒక్కసారి ట్విస్ట్ రివీల్ అయ్యాక గుండె ఝల్లుమంటుంది. ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత నుంచి ముగింపు వరకు కాస్తో కూస్తో ఆసక్తిగా కథను నడిపాడు దర్శకుడు. ప్రేమ, హీరో హీరోయిన్ల మానసిక సంఘర్షణ. మన మనసులో బాధను, ప్రేమను అన్నిసార్లూ బయటకు వ్యక్తం చేయలేం. అలాగని, దాచుకోలేం. అటువంటి పరిస్థితిని తెరపై ఆవిష్కరించడానికి శౌర్యువ్ ట్రై చేశారు.