సిరా న్యూస్,ఒంగోలు;
ఈ లీడర్ జనసేనలోకి వెళ్తున్నానన్నారు.. టీడీపీ లీడర్స్ వద్దన్నారు.. అయినా ససేమిరా చివరికి పంతం నెగ్గారు ఆ లీడర్. ఇంతకు అంతలా చెప్పింది చెప్పినట్లు చేసిన ఆ లీడర్ ఎవరో తెలుసా.. మాజీ సీఎం జగన్ సమీప బంధువు.. మాజీ మంత్రి.. రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడూ వినబడే లీడర్.. ఆయనే ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి.ఏపీలో ఎన్నికల అనంతరం టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే.. ఇక వైసీపీ నుండి టీడీపీ, జనసేన పార్టీలలోకి వలసలు ఖాయమనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. వారి అంచనాలకు కొంచెం ఆలస్యమైనా ఇప్పుడిప్పుడే వైసీపీ ప్రముఖ నేతలు.. వలసల పర్వానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు కూటమి నేతలకు వచ్చిందనే చెప్పవచ్చు. అదేంటంటే.. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరేందుకు సిద్దమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. బాలినేని టీడీపీ బాట పట్టకుండా.. జనసేన వైపు మొగ్గు చూపేందుకు ఓ కారణం కూడా ఉంది. ఆ కారణమే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, అలాగే స్థానిక టిడిపి నేతలు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలినేని, తమను వేధించారని, అక్రమ కేసులు బనాయించారని స్థానిక టిడిపి నేతల వాదన. అందుకే జనసేన పార్టీ తలుపును బాలినేని తట్టారన్నదే జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.జనసేన లో బాలినేని చేరుతున్నట్లు తెలుసుకున్న ఒంగోలు టీడీపీ నేతల ఆగ్రహం అంతా ఇంతా కాదు. జనసేనలో బాలినేనిని ఆహ్వానిస్తూ.. అభిమానులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను సైతం టిడిపి నేతలు తొలగించారు. అంతేకాదు అపరచిత వ్యక్తులు ఆ ప్లెక్సీలను చించివేశారు కూడా. ఇలా బాలినేని చేరికకు టీడీపీ అడ్డుతగులుతున్న సమయంలో ఆయన మాత్రం జనసేనలో చేరడం ఖాయం అంటూ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనలోకి బాలినేని.. కేవలం కేసుల నుండి తప్పించుకొనేందుకు చేరుతున్నారన్నది టీడీపీ వాదన. ఇటువంటి తరుణంలో బాలినేని చివరకు తన పంతం నెగ్గారనే చెప్పవచ్చు.మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వైసీపీకి చెందిన కీలక నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కిలారి రోశయ్య, ఉదయభానులు డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి పవన్ పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమయంలో పవన్ కు జ్ఞాపికను సైతం బాలినేని అందించారు. పార్టీ కండువా కప్పిన అనంతరం బాలినేని ఏదో చెబుతుండగా.. పవన్ సైతం ఆసక్తిగా విన్నారు. ఇలా స్థానిక టీడీపీ నేతలు అడ్డు తగిలినా.. జనసేనలో చేరిన బాలినేని నెక్స్ట్ ఏమి చేయనున్నారు ? అలాగే పార్టీలో కీలక పదవిని దక్కించుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన లీడర్ గా బాలినేని మళ్ళీ రాజకీయంగా బలపడి.. చక్రం తిప్పడం ఖాయం అంటున్నారు ఆయన అభిమానులు. ఇది ఇలా ఉంటే బాలినేని చొరవతో మున్ముందు జనసేనలోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం ఊపందుకుంది. ఏదైతేనేమి బాలినేని గారూ.. పంతం నెగ్గారు.. ఇంతకు వాట్ నెక్స్ట్ అంటున్నారు ఆయన దగ్గరి అనుయాయులు.