మరో ఐపీఎస్ చుట్టూ ఉచ్చు

 సిరా న్యూస్,ఏలూరు;
ఏపీలో మరో ఐపీఎస్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటుందా? మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు క్లయిమాక్స్‌కు చేరిందా? ఆనాటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా దొరికిపోయారా? రేపో మాపో ఆ ఐపీఎస్‌పై వేటు పడుతుందా? ఆ తర్వాత ఆయన్ని పోలీసులు విచారిస్తారా? అవుననే అంటున్నాయి పోలీసువర్గాలు.వైసీపీ పాలనలో చెలరేగిపోయిన ఐపీఎస్ అధికారులకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ముంబై నటి కేసులో ముగ్గురు ఐపీఎస్‌లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేసింది. ఈ కేసులో అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు తేలింది. ఈ జాబితాలోకి మరో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ చేరబోతున్నట్లు తెలుస్తోంది.జగన్ ప్రభుత్వంలో అప్పటి సీఐడీ చీఫ్‌గా వ్యవహరించారు పీవీ సునీల్‌కుమార్. ఆయన హయాంలో తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన గుంటూరు పోలీసులు, నెల రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ చివరి దశకు వచ్చింది. ఇందులో భాగంగా సీఐడీ పోలీసులను విచారించారు గుంటూరు పోలీసులు. అందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. పీవీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్‌గా ఉన్న సమయంలో విధులు నిర్వహించిన సీఐ, ఎస్ఐలు కీలక విషయాలను బయటపెట్టారు.దీంతో ఐపీఎస్ సునీల్‌కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. విచారణలో సేకరించిన ఆధారాలతో డీఐజీకి నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారి సస్పెండ్ చేసి విచారించే అవకాశమున్నట్లు అంతర్గత సమాచారం.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టామని అంగీకరించారు అప్పటి సీఐడీ అధికారులు. ఎంపీని కొడుతూ వీడియో కాల్‌లో సీఐడీ బాస్‌కు చూపించామని వెల్లడించారు. చివరకు సీఐడీ చీఫ్ నేరుగా తన సిబ్బందితో రఘురామరాజును నిర్బధించిన గదికి వచ్చి దగ్గరుండీ కొట్టించారని బయటపెట్టారు.వీడియో కాల్ చేశామని పోలీసులు చెప్పడంతో దానిపై నిర్ధారించుకున్నారు పోలీసులు. సీఐడీ చీఫ్ గుంటూరు సీఐడీ ఆఫీసులో ఉన్నారా లేదా? ఒకటికి రెండుసార్లు చెక్ చేశారు. ఆ తర్వాత డ్యూటీలో ఉన్న సీఐ, ఎస్ఐ అధికారులను విచారించారు.ఇక రఘురామరాజును కస్టడీకి తీసుకున్న సమయంలో దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు అప్పటి ఏఎస్పీ విజయపాల్. కేసు నమోదైన తర్వాత ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తే.. ఇంకెంత మందికి ఈ కేసు చుట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *