సిరా న్యూస్,ఖమ్మం ;
మిగ్‌జాం తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జేవీఆర్‌ఓసీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచాలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లి, దమ్మపేట, కూసుమంచి, కారేపల్లి మండలాలతోపాటు పాల్వంచ, తిరుమలాయపాలెంలో జోరుగా వర్షం కురుస్తున్నది. మిగ్‌జాం తుఫాను కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగానే కదులుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. తుఫానులో కొంతభాగం సముద్రంలో, మరికొంతభాగం భూమిపై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తీరానికి అత్యంత దగ్గరగా తీవ్ర తుఫాను కదులుతున్నదని, తుఫాను కేంద్రంలోని మేఘాలు భూభాగంపై ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 6 గంటలుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా తీవ్ర తుఫాను కదులుతున్నదని చెప్పింది. కావలి తీరానికి 40 కిలోమీటర్లు, బాపట్లకు 80 కిలోమీటర్ల దూరంలో తీవ్రతుఫాను కేంద్రీకృతమై ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం తీరప్రాంతంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ప్రకటించింది.