సిరా న్యూస్, బేల:
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
+ ప్రకటన విడుదల చేసిన ఏఎంసీ కార్యదర్శి మధుకర్
పత్తి కొనుగోళ్లకు మళ్లీ బ్రేక్ పడింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెట్ యార్డ్ పరిదిలోని బేల సబ్‌సెంటర్‌లో ఈ నెల 30 నుండి పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏఎంసీ కార్యదర్శి మధుకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఐ అధ్వర్యంలో బేల సబ్‌మార్కెట్ యార్డ్ పరిదిలోని అగర్వాల్ జిన్నింగ్ మిల్లులో పత్తి, పత్తి గింజల నిల్వలు పేరుకుపోవడంతోనే, తదుపరి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే మరల ఎప్పటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తారో మాత్రం చెప్పలేదు. త్వరలోనే పత్రిక ప్రకటన రూపంలో తేదీలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని జైనథ్, బేల మండలాల రైతులు గమనించి సహకరించాలని కోరారు.