-ఇన్ క్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రతి భారతీయులులో స్వతంత్ర కాంక్ష నింపిన వీరుడు
-నేడు అయన జయంతి
సిరా న్యూస్;
భగత్ సింగ్ ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్క పోడుచుకుంటాయి.
” ఇన్ క్విలాబ్ జిందాబాద్ ” అంటూ ప్రతి భారతీయులులో స్వతంత్ర కాంక్ష నింపిన వీరుడు, భరత మాత దాస్యపు శృంకాలాలు నుండి విముక్తి చేయడం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దివికేగిన నిప్పు కణిక షాహిద్ భగత్ సింగ్.ఆ దేశభక్తుడి ధైర్య సాహసాలు తెలుసుకుందాం బావి తరాలకు తెలియజేద్దాం.
పంజాబ్ రాష్ట్రంలోని ఖత్కర్ కలాన్ ప్రాంతంలో సెప్టెంబరు 28, 1907 తేదీన కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించాడు భగత్ సింగ్. అప్పటికే అతని కుటుంబసభ్యులు స్వతంత్రపోరాటంలో వున్నారు. ఈ పిల్లాడు పుట్టగానే జైల్ లో ఉన్న వారినందరినీ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది పిల్లాడు పుట్టిన వేళావిశేషంగా భావించి ఆ బిడ్డకు” భగత్ ” అని పేరు పెట్టారు.. భగత్ చిన్నప్పటి నుండే దేశపరిస్థితులు గమనిస్తూ పెరిగాడు..
భగత్ ను 12వ యేట తండ్రి ఆంగ్లేయుల పాఠశాలలో కాకుండా ఆర్యసమాజ్ నడిపే “ఆంగ్లో వైదిక్ “పాఠశాలలో చేర్చాడు. ఖల్సా పాఠశాలలకు కూడా పంపలేదు.
అదే సమయంలో జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది.13 యేళ్ళ భగత్ ఆ దుర్ఘటన విని కోపంతో ఊగిపోయాడు. జలియన్ వాలాబాగ్ కు వెళ్ళి ప్రతీకారం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ రక్తంతో తడిసిన ఆ మట్టిని తిలకంగా తిద్దుకున్నాడు.
గాంధీజీ యుగం ప్రారంభమైంది.భగత్, గాంధీ ప్రసంగాలకు ఆకర్షితులైనాడు. గాంధీజీ స్వాతంత్రం తీసుకుస్తాడని నమ్మాడు. సహాయ నిరాకరణఉద్యమంలో 13యేండ్లకే పాల్గొన్నాడు. స్కూల్ లో విదేశ వస్తువులను తగలబెట్టాడు. ఉదృతిగా జరుగుతున్న సహాయనిరాకరణద్యమం చౌరీచౌరా దగ్గర హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమం ఆపి ప్రభుత్వానికి లొంగిపోయాడు..ఇది భగత్ కు నచ్చలేదు..గాంధీ అహింస నినాదం నచ్చలేదు. బోల్షివీక్ విప్లవం సక్సెస్ కావడంతో యూరప్ ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేయసాగాడు. లెనిన్ మార్క్ ఎంగిల్స్ రచించిన పుస్తకాలు చదవసాగాడు..క్రమంగా సామ్యవాదం వైపు మళ్ళాడు.లాహోర్ లోని నేషనల్ కాలేజ్ లో చేరాడు.
భగత్ మంచి గాయకుడు.. కవిత్వం బాగా చెప్పేవాడు. 1923లో హిందీసాహిత్యసమ్మళన్ లో అద్భుతంగా కవితలు చెప్పడంతో దాని అధ్యక్షడు భీమ్ సేన్ తో పరిచయం అయింది. అతను భగత్ లోని కాంక్షను గమనించి రాంప్రసాద్ బిస్మల్ ,అష్ఫకుల్లాఖాన్ లతో నడపబడుతున్న హిందూస్తానీ రిపబ్లిక్ అసోషియేషన్ లో చేరమన్నాడు. 16 యేండ్ల కుర్రాడు …మీసకట్టు కూడా ఏర్పడలేదు..తమ ముందు నిలబడి ఉద్యమంలో చేరతానంటే ఏమిచెప్పాలో బిస్మల్ కు అర్థం కాలేదు….కానీ అష్ఫకుల్లాఖాన్ కు మాత్రం భగత్ లోని స్వాతంత్రకాంక్ష తీవ్రంగా ఉన్నట్లు కనిపించింది. భగత్ కు సభ్యత్వం ఇచ్చాడు. అక్కడ బిస్మల్ కవితలు భగత్ ను చాలా ఉత్తేజపరిచాయి. 1925 లో కకోరి రైల్ దోపిడీ జరిగింది. 1927లో బిస్మల్, అష్ఫకుల్లాఖాన్, రోహన్ సింగ్ లతో పాటు భగత్ బాబాయ్ ని కూడా ఉరితీశారు.
బిస్మల్, అష్ఫకుల్లా ఖాన్ చనిపోవడంతో హిందూస్తానీ రిపబ్లిక్ అసోషియన్ ను “హిందూస్తాన్ రిపబ్లిక్ సోషలిష్టు అసోషియేషన్ “గా మార్చారు..
దీనికి చంద్రశేఖర్ అజాద్ , భగత్ సింగ్ , సుఖదేవ్ థాపర్ ,శివరాం, రాజ్ గురు, జై గోపాల్ ముఖ్యసభ్యులు. భారత్ లో తొలి సోషలిష్ట్ సంస్థ ఇదే… ఇదే కాకుండా నౌ జవాన్ సభ , కీర్తి కిసాన్ పార్టీలను స్థాపించి యువకులను విప్లవం వైపు విపరీతంగా ఆకర్షించేలా చేసాడు..
అయితే సైమన్ కమీషన్ కు వ్యతిరేఖంగా నిరసనలు చేస్తున్న లాలాలజపతిరాయ్ గారిని క్రూరంగా కొట్టడంతో ఆయన మరణించారు. దీనికి భగత్ ప్రత్యక్ష సాక్షి. ఆ సంఘటనకు కారణమైన స్కాట్ ను చంపాలని పథకం వేయగా పొరబాటున సాండర్స్ అనే పోలీసును కాల్చిచంపాడు భగత్.
భగత్ ను, సుఖదేవ్ ను చనన్ సింగ్ అనే పోలీసు పట్టుకోగా వీరిని వెంటాడుతూ వస్తున్న చంద్రశేఖర్ అజాద్ చనన్ సింగ్ కాల్చి భగత్ ను,సుఖదేవ్ ను కాపాడి తీసుకెళ్ళిపోయాడు. భగత్ ను కొన్ని రోజులు అజ్ఞాతంలో వుండమనగా…భగత్ సిక్కుల మతవిశ్వాసాలకీ విరుద్దంగా తలవెంట్రుకలు కత్తిరించుకోని మారువేషంలో కరాచీకి వెళ్ళిపోతాడు.
ఇంతలో లార్డ్ కర్జన్ 1905 లో వేసిన విషవిత్తనం మొలకెత్తి విషవృక్షమై హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలకు దారి తీసింది.దీనితో కలత చెందిన భగత్ నాకు మతంలేదు. అది స్వార్థపూరితమైనది..నేను నాస్థికుడినంటూ ప్రకటించాడు.
ఎటువంటి విచారణలేకుండా విఫ్లవవాదులను అరెస్ట్ చేయవచ్చనే చట్టం లాహోర్ శాసనసభలో ప్రవేశపెడుతున్నారని, దానికి నిరసనగా సభలో బాంబువేసి తర్వాత లొంగిపోయి కోర్టులో ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా తన వాదనలు వినిపిస్తానన్న భగత్ మాటలను విప్లవసభ్యులందరూ సమర్థించగా చంద్రశేఖర్ అజాద్ మాత్రం తీవ్రంగా వ్యతిరేఖిస్తూ…ఆంగ్లేయులు అంత విశాలహృదయులు కాదనీ ఆ ఆలోచన విరమించుకోమనీ చెప్పి..తాత్కాలికంగా ఆపుతాడు. అయితే చంద్రశేఖర్ అజాద్ లేని సమయం చూసి డమ్మీ బాంబును లాహోర్ శాసనసభలో వేసి లొంగిపోయాడు భగత్. ఆంగ్లేయుల విచారణలో సాండర్స్ చంపిన విషయం కూడా ఒప్పుకోవడంతో భగత్ ,రాజ్ గురు,సుఖదేవ్ లకు ఉరిశిక్ష పడింది.
25 ఏళ్ళ వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెలిసినా భగత్ చేసిన సాహసం అసామాన్యం. ఇప్పటి యువత, రాజకీయ నాయకులు భగత్ సింగ్ ని కచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు భగత్ సింగ్ జన్మదినం సందర్భంగా ఆయనకు ఘనమైన జోహార్లు అర్పిస్తున్నాము.