50 వేల మంది వరకు ఉపాధి అవకాశం
సిరా న్యూస్,విజయనగరం;
ఏపీ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా పక్కన పెట్టి విశాఖపట్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, చంద్రబాబు సర్కారు వైజాగ్ తో పాటు అమరావతికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ లో భాగంగా భోగాపురం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2026లోగా అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణ పనులకు ప్రణాళికలు కొనసాగుతున్నాయి.ఏపీలో మహా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురంలో చేపడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు మరింత ఊపందుకున్నాయి. గత టీడీపీ హయాంలో మంజూరైన విమానాశ్రయానికి అప్పటి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అనుమతులు మంజూరు చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం.. కొంతమేర నిర్మాణాలు చేపట్టింది. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రీసెంట్ గా ఎయిర్ పోర్టు పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు, 2026 వరకు రన్ వే మీదికి తొలి విమానం వచ్చేలా పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గడువుకు ముందే పూర్తయ్యేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.ఓవైపు విమానాశ్రమం నిర్మాణం జరుగుతుంటే.. మరోవైపు ఎయిర్ పోర్టు చుట్టూ అధునాతన ప్రాజెక్టులు రాబోతున్నాయి. భీమిలి నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు వరకు సుమారు రూ. 1000 కోట్లతో నిర్మాణాలు చేపడుతున్నారు. విమానాశ్రయం కోసం సేకరించిన భూమిలో ఇతర అవసరాల కోసం ఉంచిన 500 ఎకరాల్లో కోస్టల్ కారిడార్ డెవలప్ మెంట్ కోసం 88 ఇవ్వనున్నారు. ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్‌లు, పార్కులు రానున్నాయి. ఆ తర్వాత పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వచ్చే అవకాశం ఉంది.రూ.4,700 కోట్లతో నిర్మాణం అవుతున్న భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగనుంది. అదే స్థాయిలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రత్యక్షంగా 50,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2026 కల్లా భోగాపురం విమానాశ్రయం పూర్తి కావడం, మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే, ఇన్నాళ్లూ హైదరాబాద్‌కు ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్తున్నవారి సంఖ్య తగ్గుతుంది. ఐటీ కంపెనీలు కూడా తమ శాఖలను ఏర్పాటు చేయడం మొదలుపెడితే.. ఏపీ ప్రజలు మరే రాష్ట్రంపై ఆధారపడకుండా సొంత రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలను పొందవచ్చు. మొత్తంగా విశాఖపట్నంతో పాటు అమరావతి హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా మారనున్నాయి.