బిగ్ ఆపరేషన్ లో హైడ్రా

సిరా న్యూస్,హైదరాబాద్;
చెరువులు, ప్రభుత్వం స్థలాలు ఆక్రమించి చేపట్టే నిర్మాణాలతో హైదరాబాద్‌ ఎంతలా ఇబ్బంది పడుతుందో.. ఫుట్‌పాత్‌లు లేక అంతకంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటోంది. దీనిపై ఇప్పుడు ఫోకస్ చేసింది హైడ్రా. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి కీలక ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సంచనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న హైడ్రా మరో బిగ్‌ ఆపరేషన్‌ చేపట్టనుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌లో ప్రధాన కారణంగా ఉన్న పుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రణమలపై బుల్డోజర్ల రంగప్రవేశం చేయనున్నాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై మొదట దృష్టి పెడతారు. అక్కడ ఆక్రమణలు ఐడెంటిఫై చేసి దుకాందారులకు నోటీసులు ఇస్తారు. తర్వాత వాటిని కూల్చివేస్తారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు ఎక్కువ ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌…. ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పీ విశ్వప్రసాద్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు పోలీసులు ఇప్పటి వరకు గుర్తించిన మేజర్‌ లోపాలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు చర్చించారు. త్వరలోనే ప్రత్యేక డ్రైవ్‌ పేరుతో ఆపరేషన్ ఫుట్‌పాత్‌ ప్రారంభించడానికి సిద్ధమైనట్టు చెప్పారు. హైదరాబాద్‌లో సామాన్యుడి నుంచి బడా వ్యక్తుల వరకు అందరూ ఫేస్ చేసే మొదటి సమస్య ట్రాఫిక్. చిన్న చినుకు పడితే చాలు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా… యూటర్న్‌లు తగ్గించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ సమస్యను కంట్రోల్ చేసేందుకే హైడ్రా, ట్రాఫిక్‌ పోలీసులు కలిసి పని చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యల్లో ఆక్రమణలు పెద్ద శాపంగా గుర్తించిన అధికారులు వాటి పని పట్టాలని నిర్ణయించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న దుకాణాలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, టెలిఫోన్‌ డక్‌లు, చెత్త డబ్బాలు ఇలా చాలా వాటి కారణంగా నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటి కారణంగా నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుందని… వాహనాలు ముందుకు కదలడం లేదని, కాలినడక వెళ్లే వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారని అధికారులు గుర్తించారు. కొందరు రోడ్లను ఆక్రమించుకొని ముందుకు రావడంతో సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. దీనికి తోడు నాళాల్లో నీరు వేగంగా వెళ్లేలా కూడా చర్యలు తీసుకుంటారు. పేరుకున్న వ్యర్థాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించనున్నారు. రోడ్డుపై నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి ఆ సమస్యకు కారణాలు తెలుసుకొని విరుగుడు చర్యలు తీసుకుంటారు. చెరువులను ఆక్రమించిన్న కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా ఈ మధ్య కాస్త నెమ్మదించింది. కోర్టు కేసులు, రాజకీయ విమర్శల కారణంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. వివాదాలు కోర్టులో ఉన్నందున కాస్త గ్యాప్ ఇచ్చామే తప్ప వెనక్కి తగ్గలేదని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఆపాలనే ఒత్తిడి లేదని చెబుతున్నారు.చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారిలో చాలా మంది కోర్టులకు వెళ్లారు. ఆ కేసులో ఇప్పుడు కోర్టులో నడుస్తున్నాయి. వాటిపై క్లారిటీ వచ్చిన తర్వాత మళ్లీ పునః ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *