హైడ్రాపై బీజేపీ గర్జన…

సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర రాజధాని నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులను హడలెత్తిస్తున్న హైడ్రాపై పోరాటానికి బీజేపీ రెడీ అవుతోంది. హైడ్రా దూకుడును అడ్డుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలను వినియోగించుకోవాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకోసం న్యాయ పోరాటంతోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారాలను వాడుకునే విషయమై ప్రణాళిక రచిస్తోంది. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలపై తొలుత బీజేపీలో కొంత గందరగోళం కనిపించింది. కాలక్రమేణా ఆ గందరగోళం ఇప్పుడు తెరమరుగైంది. హైడ్రా పేరిట పెద్దలకో న్యాయం… పేదలకు మరో న్యాయం అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కాలని నిర్ణయించినట్లు సమాచారం.ఆక్రమణలపై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనకు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తొలుత మద్దతుగా నిలిచారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా ఎంఐఎం నేతల ఆక్రమణలను సైతం తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌ వంటివారు హైడ్రా పేరిట అరాచకం చేస్తున్నారని విమర్శించారు. ఐతే ఈ భిన్న వాదనలపై పార్టీలో కొంత గందరగోళం కనిపించగా, ప్రస్తుతం అంతా ఏకాభిప్రాయానికి వస్తున్నట్లు చెబుతున్నారు. తొలుత ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన ఎంపీ రఘునందన్‌రావు ఇప్పుడు తన అభిప్రాయం మార్చుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడుతోంది బీజేపీ.ఇక ఇదే విషయమై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామన్నట్లు సీనియర్‌ నేత, ఎంపీ ఈటల రాజేందర్‌ అడుగులు వేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై మరే నేత చేయని విధంగా నేరుగా బాధితులను కలుస్తూ వారిని ఓదార్చుతున్నారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను సైతం ఈటల వెనక్కి నెట్టేశారంటున్నారు. హైడ్రా కూల్చివేతలపై తొలుత ప్రభుత్వానికి మద్దతుగా అన్నివర్గాలు నిలిచినా, క్రమేణా ఆ పరిస్థితిలో మార్పు వస్తోందని భావిస్తోంది బీజేపీ. ప్రధానంగా అన్నిరకాల అనుమతులు చూసి, అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న, కొనుకున్న పేద, మధ్యతరగతి వారికే ఎక్కువ నష్టం జరుగుతోందని ఆరోపిస్తోంది బీజేపీ. ఈ విషయంలో పేదలకు అండగా నిలవాలని భావించిన ఈటల రాజేందర్‌.. హైడ్రా కూల్చివేతలపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఇక ఈటలతోపాటు బీజేపీ నేతలు మొత్తం హైడ్రాను టార్గెట్‌ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వంపై పోరాడటానికి ఇదే ప్రధాన ఆయుధంగా భావిస్తున్న కమలనాథులు… కాంగ్రెస్‌ పార్టీని ఇరుకన పెట్టేలా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు హైడ్రాతో రాజకీయంగా తమనే ప్రయోజనం దక్కుతుందని ఆశిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ… బీజేపీ ప్రచారాన్ని, పోరాటాన్ని ఎలా తిప్పికొడుతుందనేది ఆసక్తికరంగా మారింది.ఏదిఏమైనా రాష్ట్రంలో కాంగ్రెస్‌, వర్సెస్‌ బీజేపీ యుద్ధానికి హైడ్రా కారణమవ్వనుందనేది స్పష్టమవుతోంది. మొత్తానికి హైడ్రాతో రాష్ట్రంలో మైలేజ్‌ పెంచుకోవాలని అధికార కాంగ్రెస్‌ ప్లాన్‌ చేయగా, అదే హైడ్రాతో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే బీజేపీ ప్లాన్‌ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ నేత, ఎంపీ ఈటల స్కెచ్‌తో కాంగ్రెస్‌ సర్కార్‌పై పైచేయి సాధించేలా అడుగులు వేస్తున్నారు కమలనాథులు. దీంతో ఇక హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్‌ వర్సెస్‌ ఎంపీ ఈటలగా మారనుందా? అనేది చూడాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *