మళ్లీ బోట్ గేమ్…

సిరా న్యూస్,గుంటూరు;
బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన.. పూర్తిగా పొలిటికల్ టర్న్‌ తీసుకుంది. కుట్ర కోణం ఉందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే.. డైవర్షన్ పాలిటిక్స్‌ అని వైసీపీ కౌంటర్ ఎటాక్‌కి దిగుతోంది. ఇంతకీ ఎవరి వాదనలో నిజముంది? అనేది ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశం బ్యారేజీకి లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. సరిగ్గా ఆ సమయంలోనే మెరుపు వేగంతో కొట్టుకొచ్చిన పడవలు బ్యారేజీని ఢీకొట్టాయి. ఆ క్రమంలో 67, 69, 70 గేట్ల దగ్గర దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. అయితే కొట్టుకొచ్చిన బోట్ల కోసం యజమానులెవరూ రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో విచారణ జరపాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొట్టుకొచ్చిన వాటిలో మూడు పడవలు కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. ఉషాద్రితో పాటు సూరాయపాలెం వాసి కోమటిరెడ్డి రామ్మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ కోర్టుకి తరలించారు. బోట్ల ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.బ్యారేజీలోకి పడవలు ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయి? బ్యారేజీని పడవలు ఢీకొట్టిన సమయంలో 11లక్షల 20వేల క్యూసెక్కుల వరద వచ్చిందని.. పడవలు ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవేళ పిల్లర్‌ను ఢీకొడితే పరిస్థితి వేరేలా ఉండేదని చంద్రబాబు పేర్కొన్నారు. మూడు పడవలకి వైసీపీ పార్టీ రంగులు ఉన్నాయని.. తప్పులు చేసిన వైసీపీ ఎదురు దాడి చేయడమేంటి? అంటూ ప్రశ్నించారు.బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు.. కుట్ర చేసి ఉండొచ్చంటూ పేర్కొన్నారు. అనుమానాలు బలపడుతున్నాయంటూ చెప్పారు. మరోవైపు నిజానిజాలు దర్యాప్తులో తేలుతాయని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.ఈ ఆరోపణల్ని వైసీపీ కొట్టిపడేసింది. వరదల్ని అంచనా వేయలేక.. ఈ ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సహాయక చర్యల్లో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తమపై నేపం నెడుతున్నారని మండిపడ్డారు.బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనలో నిజంగానే కుట్ర జరిగిందా? లక్షల క్యూసెక్కుల వరద నీటిలో కావాలనే పడవల్ని వదిలేశారా? ప్రస్తుతానికి మాత్రం ఇద్దరి అరెస్ట్ మాత్రమే జరిగింది. ముందు ముందు ఇంకా ఎన్ని అరెస్ట్‌లు ఉంటాయి? ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *