ఢిల్లీలో ధర్నాకు బీఆర్ఎస్ ప్లాన్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. హామీల అమలుపై ఢిల్లీ కేంద్రంగా భారీ ఆందోళన చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఢిల్లీలో అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం ముందు భారీ ధర్నా చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది.గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలకు తోడు భారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. కీలకంగా 6 గ్యారెంటీలు, 11 హామీలు అంటూనే.. మొత్తం 420 వరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోతో తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ ను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసింది రేవంత్ సర్కార్. మిగిలిన కీలక హామీలను అమలు చేయడంలో విఫలమైందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ హామీల అమలును గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ హైకమాండ్ కు వినిపించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు వేస్తోంది.రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించలేదు. ఆ తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారం చేశారు. అభ్యర్థుల తరఫున నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒకప్పటి కేసీఆర్‌ను తలపించేలా ప్రసంగాలు చేశారు. కానీ.. ఆ ఎన్నికల్లోనూ పెద్దగా ఫలితాలు రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఒక్క అభ్యర్థి కూడా ఎంపీగా గెలవలేకపోయారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ పూర్తిగా ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు.ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యాలపై కానీ.. ప్రజాసమస్యలపై కానీ ఒక్క స్టేట్‌మెంట్ కూడా కేసీఆర్ నుంచి రాలేదు. అటు వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డా నోరు మెదపలేదు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వైఖరి చర్చకు దారితీసింది. ప్రజల్లోనూ కేసీఆర్‌కు ఏమైంది అన్నట్లుగా చర్చ నడిచింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కేసీఆర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వేశారు. రకరకాల కామెంట్లు చేస్తూ వచ్చారు. అటు సీఎం రేవంత్ కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ ఓ అప్పీల్ కూడా చేశారు. సీనియర్ నేతగా తమకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. పాలనాపరంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా బయటకు రాలేదు. కేవలం బడ్జెట్ సమావేశాల వేళ మాత్రం ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై వెళ్లిపోయారు. ఇక ఆ తరువాత కనిపించలేదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే డిసెంబరు నుంచే ఆయన తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వ్యూహాలు సిద్ధం చేసినట్లుగా సమాచారం. డిసెంబరు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తికానుంది. దాంతో ఏడాది పాలనపై కేసీఆర్ ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఎజెండాగా మార్చుకొని రాజకీయాల్లో పుంజుకునేందుకు వ్యూహాలు రచించారని సమాచారం. సంక్రాంతి తరువాత రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారు.కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ముందు నుంచీ అనుకున్నారు. ఎట్టకేలకు ఏడాది పూర్తి కావస్తుండడంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించారు. నిత్యం కేసీఆర్‌తో భేటీ అవుతున్న నేతలకు కూడా ప్రజా సమస్యలపై పోరాడాలంటూ సూచిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా వేగంగా నడిపించాలని కార్యకర్తలకు చెబుతూ వచ్చారు. ముఖ్యంగా పార్టీలోకి యువ రక్తం వచ్చేలా ప్లాన్ చేయాలని సూచించారు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాక వీటన్నింటికీ కార్యాచరణ ప్రారంభించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.అయితే, త్వరలో మహారాష్ట్ర సహా మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది సందర్భంగా ధర్నా నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం మరికొందరు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, దసరా పండుగ పూర్తి కావడంతో పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీలో ధర్నాపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హస్తినలో బీఆర్ఎస్ ధర్నాపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *