రగిలిపోతున్న వేమిరెడ్డి…

సిరా న్యూస్,నెల్లూరు;
ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గత దశాబ్దకాలంగా చక్రం తిప్పుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటినుంచి వైసీపీలో కొనసాగుతూ పార్టీకి అండదండ జిల్లాలో తానే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా.. పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ తనవంతు సహకారం అందించి ఆర్థికమగా అండగా నిలిచారు. అటువంటి నేతను పట్టించుకోలేదన్న విమర్శలు 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికమయ్యాయి. వాటిని నిజం చేస్తూ.. ఆయన చెప్పిన వారికి కాదని నెల్లూరు నగర ఎమ్మెల్యే టికెట్ ని.. జగన్ మరొకరికి కట్టబెట్టారు. దీంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురై.. పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఆర్థికంగా వెన్నుదన్ను ఉన్న వేమిరెడ్డి లాంటి నేత పార్టీలో చేరడంతో.. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఆయన చేరికతో మాజీ ఎమ్మెల్యేలు నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఘనంగా పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పు వచ్చింది. పార్టీ అధికారంలోకి రాగానే కొద్దిరోజుల పాటు ఆనందంతో శుభాకాంక్షలు చెప్పిన నేతలు ఆ తర్వాత క్రమేపి ఆయనను కలవడం ఆపేశారట. తనకు కేటాయించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే.. తన వంతు భావించిన ఆయన.. ఇప్పుడు వ్యాపారాలలో కాస్త బిజీ అయ్యారట. అయితే ఇప్పుడు నేతల తీరులో కూడా మార్పు వచ్చిందని.. వేమిరెడ్డిని పట్టించుకునే నేతలే కరువయ్యారని జోరుగా చర్చ జరుగుతుందట.రీసెంట్ గా జరిగిన నెల్లూరు డీఆర్సీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. మండలి సమావేశంలో ఇంచార్జిగా వ్యవహరించిన రూరల్ ఆర్డీవో అనూష.. అక్కడికి వచ్చిన వారి పేర్లన్నీ చదివి ఎంపీ వేమిరెడ్డి పేరును మాత్రం విస్మరించారట. పేరు పిలవకపోవడమే కాకుండా, బొకే కూడా ఇవ్వలేదని వేమిరెడ్డి అలిగారు. దీంతో ఆయన తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని తీసుకుని వేదికపై నుంచి వెళ్లిపోయారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ కూడా అదే వేదికపై ఉన్నారు. వేమిరెడ్డి హఠాత్తుగా లేచి వెళ్లిపోతుండటంతో ఆయన కారు వరకు వెళ్లి మంత్రి ఆనం సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.ఆ తర్వాత తన వెంట వచ్చిన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని.. సమావేశంలో పాల్గొనాలని చెప్పడంతో ఆమె మీటింగ్ లో పాల్గొన్నారు. నేను మటుకు ఇక రాను అని వేమిరెడ్డి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మంత్రులకు పూల బొకేలు అందించి స్వాగతాలు పలికిన అధికారులు.. ఎంపీ వేమిరెడ్డిని ఎందుకు విస్మరించారో ఇప్పటికీ అంతుపట్టని పరిస్థితి నేతల్లో నెలకొంది.ఈ వ్యవహారం చూస్తే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు.. వేమిరెడ్డిని వాడుకున్న నేతలు ఇప్పుడు ఆయనను దూరం పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. నాడు వైసీపీలో చక్రం తిప్పిన నేత.. ప్రస్తుతం ఉన్న పార్టీ నేతలకు రుచించలేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఇంత మార్పు వచ్చి అవమానపడేలా నేతలు, అధికారులు ఎందుకు వ్యవహరిస్తున్నారు.. అసలు ఆయన వెనుక ఏం జరుగుతుంది అన్న విషయంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి ఆర్థిక పరిపుష్టిని ఇచ్చిన వేమిరెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీలో కొనసాగే పరిస్థితి ఉంటుందా అని కూడా పొలిటికల్ వర్గాల్లో చరచర జరుగుతోంది.ఎన్నికల ముందు తన భార్య ప్రశాంతి రెడ్డికి టికెట్ అడిగితే జగన్ ఏవేవో సాకులు చెప్పి పట్టించుకోలేదట. అంతే కాకుండా వేమిరెడ్డిని ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించినా.. ఆయన పరిధిలో ఉండే నెల్లూరు సిటీ స్ధానంలో ఓ జూనియర్ నేతకు టికెట్ ఇచ్చేశారు. దీంతో అలిగిన వేమిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లి అదే నెల్లూరు ఎంపీగా గెలవడంతో పాటు తన భార్యను కోవూరులో గెలిపించుకున్నారు. దీంతో వేమిరెడ్డి అలక, చరిత్ర తెలిసిన వారెవరూ ఆయనతో పెట్టుకోరని ఆయన అభిమానులు చెబుతున్నారట.ఏదేమైనా ఎంపీ వేమిరెడ్డి ఎన్నికలకు వైసీపీలో అవమానాలను ఎదుర్కొన్న వేమిరెడ్డి.. ఇప్పుడు టీడీపీలో కూడా అవమానాలకు గురవుతున్నారని చర్చ జరుగుతోంది. ఈ ఊహాగణాలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఎలా చెక్ పెడతారు ? అవమానాలతోనే వేమిరెడ్డి పార్టీలో కొనసాగుతారా ? వేమిరెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *