సిరా న్యూస్,హైదరాబాద్;
నగరంలోని పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం ఉదయం ఓ కారు పంజాగుట్ట వద్ద బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
పంజాగుట్ట ప్రజాభవన్ పక్కన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఓ కారు పంజాగుట్ట వైపునకు వస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. కారులో ఉన్న వ్యక్తి అతివేగంతో కారును నడిపించాడు. ఈ క్రమంలో పంజాగుట్ట వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. మితిమీరిన వేగంతో వాహనం దూసుకురావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు వచ్చిన వేగానికి చుట్టుపక్కల వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టడంతో వాహనదారులు అవాక్కయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని కారులో ఇరుక్కున్న యువకులను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయమే ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసి.. ప్రమాదానికి గురైన కారు అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గురైన కారు ఎవరది.. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు… మందు సేవించి వాహనం నడుపుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. అతివేగంగా కారు నడపడంపై ఇటు పోలీసులు.. అటు వాహనదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.