సిరా న్యూస్,హైదరాబాద్;
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, కిశోర బాలికలు, గర్భిణులకు పెట్టే ఆహారం నాణ్యత లోపిస్తోంది. తాజాగా చిన్నారులకు ఇచ్చే ఉడకబెట్టిన కోడిగుడ్డులో కోడిపిల్ల రావడం సంచలనంగా మారింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు గుడ్లు పంపిణీ చేయగా ఆ గుడ్డును ఇంటికి తీసుకెళ్లిన లబ్దిదారులు ఉడకబెట్టి పొట్టు తీసి చూడగా చనిపోయిన కోడిపిల్ల ప్రత్యక్షం కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇదేమిటని అంగన్వాడీ టీచర్ను ప్రశ్నించగా తనకేం తెలియదని తనకు అందజేసిన గుడ్లను తాను సరఫరా చేసినట్లు సమాధానం చెప్పింది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అనేక కేంద్రాల్లో ఈ సమస్య ఉత్పన్న మైనట్లు సమాచారం. పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసే పౌష్టికా హారంపై సరైన నిఘా లేకపోవడంతో నాసిరకం ఉత్పత్తులను కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పాడైపోయిన గుడ్లు తిని కొందరు పిల్లలు అస్వస్థతకు గురై నట్లు కూడా సమాచారం.