సిరాన్యూస్, చర్ల
చట్టాలను హరించి వేస్తున్న రెవెన్యూ అధికారులు
* ఏజెన్సీ చట్టాలు గాలిలోకి
* వారికి ఏజెన్సీ చట్టాలు వర్తించవా.?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులే వలసదారులుగా చిత్రీకరించబడుతున్నారు. దానికి కారణం సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే, అటవీ, ఖనిజ సంపదలు ఈ ప్రాంతంలో ఉండటమే వారికి శాపంగా మారింది అని చెప్పాలి. నిజానికి 5 షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులు తప్ప ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనేతరులు అందరూ వలసవాదులే అని షెడ్యూల్ తెగల చట్టాల చెబుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 కింద షెడ్యూల్ తెగల ప్రజల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేకంగా ప్రోత్సహించవలసి ఉంది. వారి హక్కులకు అన్యాయం జరగకుండా వారు ఏ రకమైన హక్కుల భంగానికి గురికాకుండా రక్షించవలసిన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థలపై ఉన్నప్పటికీ ఈ ప్రాంత గిరిజనులకు అన్యాయమే జరుగుతుంది. సరిహద్దు రాష్ట్రం నుండి వచ్చి 30 సంవత్సరాల నుండి చర్ల ఏజెన్సీ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వందలాదిమంది ఆదివాసీలు నేటికీ రాజ్యాంగ హక్కులను పొందలేకపోతున్నారు. దీనివలన వారు విద్య, ఆర్థిక రంగాలలో వెనుకబడి అక్కడి ఆదివాసి పిల్లలు, యువకులు విద్రోహ శక్తుల వైపు అడుగులు వేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఆదివాసి చట్టాలు, ఉన్నప్పటికీ ఆ చట్టాల వలన వారికి లబ్ది చేకూరకపోగా అవే గిరిజన చట్టాలు గిరిజనేతరుల పాలిట రాజమార్గాలుగా మారి వారిని ఈ ప్రాంతంలో ఆర్థిక శక్తులుగా మారుస్తున్నాయి. మరి చర్ల రెవిన్యూ అధికారులకు వలస ఆదివాసీల కుల ధ్రువీకరణ పత్రాల మీద ఉన్న చిత్తశుద్ధి, వారి దొడ్డి దారి విధానాల వలన పుట్టుకొస్తున్న భూ పట్టాలు, బినామీ వ్యాపారాలకు పర్మిషన్లు, ఈ ప్రాంతంలో లేని సామాజిక వర్గాలకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు, ఈ విషయాలలో చట్టాలకు పాతర వేస్తున్న రెవిన్యూ వారికి ఏజెన్సీ చట్టాలు ఎందుకని వారి కార్యనిరతి దక్షతకు గుర్తుకు రావు ఎందుకనో.? ఇకనైనా వలస ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసి వారి సామాజిక ఎదుగుదలకు సహకరించాలని వలస ఆదివాసి గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.