సిరాన్యూస్, చర్ల
చర్ల బీఆర్ఎస్ అడాక్ కమిటీ నాయకుల మధ్య చిచ్చు పెట్టిందా..?
* అసంతృప్తిలో నాయకులు
* గిరిజన నాయకులను పట్టించుకోని అడక్ కమిటీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ అడక్ కమిటీని ఎన్నుకోవడంతో బీఆర్ఎస్ నేతలలో అసంతృప్తి రేగింది అనే చెప్పాలి. గడచిన ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కండవ కప్పుకోవడం తో అప్పటిదాకా ఎమ్మెల్యే గెలుపుకై కష్టపడిన బీఆర్ఎస్ చర్ల మండల నాయకులలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే తో వెళ్లలేక పార్టీని అంటిపెట్టుకొని ఉన్నది కొందరైతే, తమ వ్యాపారాలకు ఇబ్బందులు వస్తాయని బీఆర్ఎస్ పార్టీని అంటి ముట్టనట్టు ఉన్న మరి కొంతమంది నాయకులు. అయితే త్వరలో బై ఎలక్షన్లు రావచ్చు అనే ఉద్దేశంతో చర్ల బీఆర్ఎస్ మండల పార్టీని రద్దుచేసి దాని స్థానంలో కొత్తగా అడక్ కమిటీని వేసి మండల పార్టీలో పునరుత్తేజాన్ని తేవాలని పార్టీ తలచింది. దానిలో భాగంగానే బుధవారం చర్ల లో కొత్తగా అడక్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైందని చెప్పాలి. నూతనంగా ఎన్నిక చేసిన అడక్ కమిటీ నిర్మాణంలో సీనియర్ నాయకుల అభిప్రాయం తీసుకోలేదనే వాదన వినిపిస్తుంది. మొదటినుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నాయకులను విస్మరించడం జరిగిందని, చర్ల మండలంలో అధికంగా ఉన్న గిరిజన సామాజిక వర్గం నుంచి ఒక్క గిరిజన నాయకుడికి అడక్ కమిటీలో చోటు కల్పించకపోవడం ఏంటని గిరిజన నాయకులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం ప్రభావం చూపిస్తుందని, అడక్ కమిటీ ఎన్నిక ఏకపక్ష నిర్ణయాలతో కాకుండా అందరి ఏకాభిప్రాయంతో వేసి ఉంటే బాగుండేది అని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వారిలో ఉన్న అసంతృప్తిని తగ్గించి పార్టీని ముందుకు తీసుకెళ్లడం అడక్ కమిటీ ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.