మీ ఇల్లు సేఫ్ జోన్ లా ఉందా… చెక్ చేసుకోండి ఇలా…

 సిరా న్యూస్,హైదరాబాద్;
మొన్న ఇళ్లు కొన్నా.. నేడు హైడ్రా నోటీస్ వచ్చింది. ఇదేంది భయ్యా.. ఏమి అర్థం కావడం లేదు.. మోసపోయాను భయ్యా.. అనే మాటలు ఇటీవల మనకు హైదరాబాద్ లో వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం స్థలం కొనుగోలు చేసే ముందు ఆస్థలం చెరువులు, కుంటల పరిధిలో ఉందా లేదా అన్న విషయాన్ని మనం గ్రహించలేకపోవడమే. అయితే హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని, వరదల సమయంలో భారీ నష్టాలు చవిచూసే అవకాశం లేకుండా.. చెరువులు, కుంటల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకై హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ఆక్రమణల కూల్చివేత పర్వాన్ని సాగిస్తోంది. అయితే హైడ్రాను మరింత బలోపేతం చేసి.. మున్ముందు ఇక ఎక్కడా ఆక్రమణలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్.ఇలా హైడ్రా కూల్చివేతలు సాగుతుండగా.. కొందరి మోసపూరిత మాటలను నమ్మిన వారు.. అప్పటికప్పుడు బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలోకి గృహాలను కొనుగోలు చేస్తున్నారు. దీనితో హైడ్రా నోటీసులు అందుకున్న వారు అవాక్కవుతున్నారు. ఇటువంటి మోసాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఏదైనా స్థలాన్ని, ఇంటిని కొనుగోలు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా కోరుతోంది. అయితే మనం కొనుగోలు చేసే స్థలం, ఇళ్లు గత 30 ఏళ్ల క్రితం ఎలా ఉందో తెలుసుకొనే అవకాశం మనకు వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇది భూములు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే కోట్లు వెచ్చించి స్థలాన్ని కొనుగోలు చేసి, ఆ తరువాత హైడ్రా నోటీసులు అందుకోవడం కన్నా.. ముందుగానే ఆ స్థలం చెరువు, కుంటలలో ఉందా అనే విషయం నిర్ధారించుకోవడం ఉత్తమం.స్థలం పూర్వ వివరాలు మనం తెలుసుకొనేందుకు ముందుగా మనం గూగుల్ లో google earth pro అని సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేసిన అనంతరం ఎర్త్ వర్షన్ అంటూ మనకు కనిపిస్తుంది. ఆ లింకును క్లిక్ చేసిన తరువాత పైన మూడవ ఆప్షన్ గా గూగుల్ ఎర్త్ ప్రొ వెబ్ అంటూ కనిపిస్తుంది. ఇక అక్కడ మనం కొనుగోలు చేసే స్థలం ఉండే.. ప్రాంతం యొక్క పేరు టైప్ చేస్తే చాలు.. ఆ ప్రాంతం యొక్క ముఖచిత్రం మనకు కనిపిస్తుంది. అందులో పైన ఒక క్లాక్ సింబల్ కనిపిస్తుంది కదా.. ఇక ఆ సింబల్ ని మనం జరిపే కొద్దీ మనకు ఆ ప్రాంతం పూర్వ ముఖచిత్రం మనకు పూర్తిగా కనిపిస్తోంది . ఉదాహరణకు 30 ఏళ్ల వరకు క్లాక్ ని జరిపితే.. మన స్థలం కుంట, చెరువులో ఉందా అనేది కూడా మనం వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం సైతం హైడ్రా టార్గెట్ లో ఉన్న గృహాలు, స్థలాలు వాటి వివరాలను కూడా ప్రత్యేక వెబ్ సైట్ లో పొందుపరిచింది. మీరు గూగుల్ లోకి వెల్లి lakes.hmda.gov.in వెబ్ సైట్ లోకి వెళితే చాలు.. హైడ్రా పరిధిలోకి వచ్చే స్థలాల పూర్తి జాబితా ఇలా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దు.. స్థలాన్ని కొనుగోలు చేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి.. లేకుంటే మీ డబ్బు గల్లంతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *