సిరా న్యూస్;
నాలుగేళ్ల ప్రతిష్టంభన ముగిసింది. భారత్ చైనాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఎల్‌ఏసీలో ఇరు సైన్యాల మధ్య ఇకపై ఘర్షణలు ఉండవనే ఆశ మళ్లీ మొగ్గతొడిగింది. భారత్, చైనా రైవల్రీ ఆటలో హాల్ట్ రావడంతో రెండు దేశాల మధ్య వాతావరణం చల్లారిందనే సూచనలు కనిపిస్తున్నాయి. 40 మంది ప్రాణాలు తీసిన నాలుగేళ్ల నాటి ఘర్షణకు తర్వాత ఇది ఇరు దేశాల సంబంధంలో కీలక ముందుడుగేనని చెప్పాలి..భారత్ – చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లో దాదాపు నాలుగేళ్లు సైనిక ప్రతిష్టంభనను ముగించడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. తూర్పు లద్దాఖ్ సెక్టార్ లోని కీలక ప్రాంతాలైన డెస్సాంగ్, డెమ్చోక్ నుంచి కొన్ని తాత్కాలిక సైనిక స్థావరాలను, తాత్కాలిక నిర్మాణాలను ఇరు దేశాలు తొలగిస్తున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. బలగాల ఉపసంహరణ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత మరో నాలుగైదు రోజుల్లో ఈ రెండు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ను పునరుద్దరించనున్నట్లు తెలుస్తోంది.తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్ – చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇరవై మందికిపైగా భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఎల్ఏసీ వెంబడి ఇరు దేశాలు భారీగా సైనిక బలగాలను మోహరించాయి. అక్కడ తాత్కాలిక నిర్మాణాలు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాయి. ఎల్ఏసీ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణాన్ని తగ్గించేందుకు ఇరు దేశాల సైనిక అధిపతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా సఫలం కాలేదు.ఇరుదేశాల మధ్య ఇటీవల ఒప్పదం కుదిరింది. రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ ఒప్పందాన్ని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ధ్రువీకరించారు. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి 2020 గల్వాన్ ఘర్షణకు ముందు నాటి యథాస్థితి కొనసాగనుంది. ఇక నుంచి 2020లో గస్తీ నిర్వహించిన సైనికులు పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఒకవైపు స్నేహ హస్తం చూపిస్తున్నట్లే చూపించి, మరో చేత్తో గన్ గురిపెట్టే బుద్ది చైనాది. అందుకే, ఇప్పుడు ఈ అనుమానాలు. 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం తర్వాత చైనా ఓవరాక్షన్ చాలా సార్లు హద్దు మీరింది. 1975 నుండీ సరిహద్దులో ఎన్నో సార్లు ఆక్రమణలకు పాల్పడింది. భారత్ సహనాన్ని అవకాశంగా తీసుకొని రెచ్చిపోయింది. అయితే, నాలుగేళ్ల క్రితం 40 మందిని బలితీసుకున్న గాల్వాన్ లోయ ఘర్షణలతో అది పీక్స్‌కెళ్లింది. కట్ చేస్తే.. ఇప్పడు, రెండు దేశాలూ ‘బోర్డర్ పెట్రోల్ ఒప్పందానికి’ వచ్చాయి.అక్టోబర్ 22 నుండి 24 వరకూ రష్యాలో బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌లు మాట్లాడుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించే ప్రయత్నాలలో ఈ ఒప్పందం కీలకమైన పురోగతిగా కనిపిస్తోంది. ఈ ఒప్పందంతో.. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖలో పెట్రోలింగ్ నిర్వహించే హక్కులను పునరుద్ధరించడానికి రెండు దేశాలూ అంగీకరించాయి. దీనితో, లడఖ్‌కు ఉత్తరాన ఉన్న డెప్సాంగ్ మైదానాలు, దక్షిణాన డెమ్‌చోక్ ఎల్‌ఎసి వెంబడి, పాత పెట్రోలింగ్ పాయింట్ల వరకు పెట్రోలింగ్ నిర్వహించుకోవచ్చు. అంటే డేప్సాంగ్ మైదానాల్లో, డెమ్‌చోక్‌లోని చార్డింగ్ నుల్లాలో పెట్రోలింగ్ పాయింట్ వరకు భారత సైనికులు పెట్రోలింగ్ చేయొచ్చు. ఇక, ఈ ఒప్పందంలో భాగంగానే, తూర్పు ప్రాంతంలో, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన ప్రదేశాలకు సంబంధించి కొన్ని పరస్పర ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.నాలుగేళ్ల క్రితం, 2020లో ఘర్షణలు చోటుచేసుకున్న గాల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సో పాయింట్లను రెండు సంవత్సరాల క్రితం బఫర్ జోన్‌లు ఏర్పాటు చేసి, దళాలను విడదీశారు. గతంలో ఇక్కడ పెట్రోలింగ్ చేసే సైనికులు 13 నుండి 18 మంది ఉండగా.. ఘర్షణను నివారించడానికి కనీసం 14 నుండి 15 మంది సైనికులు గస్తీలో ఉంటారని నిర్ణయించారు. ఇక, ఇప్పుడు, ఇరుపక్షాల పెట్రోలింగ్ పరస్పరం మార్చుకోడానికి ఒప్పందం కుదిరింది. పెట్రోలింగ్ చేసే క్రమంలో రెండు వైపుల నుండీ సమన్వయం ఉంటుందనీ.. ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయని ఒప్పందంలో పొందుపరిచారు. ఇందులో భాగంగా, నెలవారీ ప్రాతిపదికన, కేస్-టు-కేస్ ఆధారంగా కమాండర్, కో-కమాండర్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇప్పటివరకు కుదిరిన అవగాహన ప్రకారం, డెప్సాంగ్‌లోని కీలక ప్రాంతాల నుండి చైనా దళాలు ఉపసంహరించుకుంటాయి. అయితే, ఇది లడఖ్‌లో రాబోయే తీవ్రమైన శీతాకాల ప్రణాళికలో భాగమేనని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.2020లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణ తర్వాత భారత్-చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే సరిహద్దుల వెంబడి ఇరువైపులా భారీగా బలగాలను మోహరించాయి. దాదాపు 68 వేల మంది సైన్యాన్ని భారత్ సరిహద్దుకు పంపించింది. సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం ఏదైనా కవ్వింపులకు పాల్పడితే.. దానికి దీటుగా స్పందించేందుకు ఇండియన్ ఆర్మీ అన్నివిధాలా సిద్ధమైంది. అయితే, ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆర్మీ కమాండర్ స్థాయిలో గత నాలుగేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉండగా.. తాజాగా కీలక పురోగతి కనిపించింది. దీనితో, అంతర్జాతీయ ఫోరమ్‌లలో రెండు దేశాల మధ్య ఉన్నత-స్థాయి దౌత్య చర్చలు సులభతరం అవుతాయి. అలాగే, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. దీనితో పాటు, సరిహద్దులో భారత్ చేస్తున్న మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఇక, చైనా విషయానికొస్తే, ఇతర ప్రపంచ ఉద్రిక్తతల మధ్య భారతదేశంతో సరిహద్దు వివాదాలను తగ్గించడం దానికి వ్యూహాత్మక లాభమనే చెప్పాలి.