సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తయింది. వంద రోజుల పాలనలో మంచి చేశామని మనది మంచి ప్రభుత్వం అని ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ సొంత పార్టీ కార్యకర్తల్లో మాత్రం అసంతృప్తి పెరిగిపోయిందన్న ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వేధించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పకడ్బందీ కార్యాచరణను ఖరారు చేసుకునేదిశగా ప్రభుత్వం రెడీ అయింది. నారా లోకేష్ రెడ్ బుక్ అమలు ప్రారంభమయిందని ప్రకటించారు. మరో వైపు చంద్రబాబు స్వయంగా ఈ కేసులపై సమీక్ష చేశారు. వైసీపీ హయాంలో మైనింగ్, మద్యం, ఇసుక సహా అనేక స్కాంలపై విచారణలు జరుగుతున్నాయి. ఇందులో గనుల శాఖ వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. రెండున్నర వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసులు పెట్టింది. ఇక మద్యం విషయంలో అతి పెద్ద స్కామని చెబుతోంది. ఇప్పటికే కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ బయటకు రాలేదు. ఇక మైనింగ్ సహా ఇతర అంశాల్లో విచారణలు జరుగుతున్నాయి. హీరోయిన్ జెత్వానీ కేసులో లోతైన విచారణ జరిపి దారి తప్పిన అధికారుల్ని ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారు. అలాగే.. టీడీపీ హయాంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కేసులు పెట్టేదిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ హయాంలో కక్ష సాధింపులు ఉండవు కానీ.. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు చెబుతున్నారు.ఈ ప్రకారం ఆధారాలు ఉన్న ప్రతి అంశంలోనూ కేసులు పెట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు తమకు అందుతున్న సమాచారం, సాక్ష్యాల ఆధారంగా కేసులు పెట్టబోతున్నారు. కక్ష సాధింపులు అనే ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా ఈ కేసుల్ని డీల్ చేయాలనుకుటున్నారు. అయితే చేసే ఆరోపణలు చేస్తూనే ఉంటారని వారిని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని చంద్రబాబు సూచించారు. అందుకే చాలా కేసుల విషయంలో ముందుగా సాక్ష్యాల సేకరణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అరెస్టుల వంటి కార్యాచరణ చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో అవినీతి వ్యవహారాలు, కేసుల విచారణను సాధారణ పోలీసు విభాగం దర్యాప్తు చేయడం వల్ల ఆలస్యం అవుతుంది కాబట్టి సీఐడీకి కేసులన్నీ బదలాయించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇప్పటికే మదనపల్లి పైల్స్ కాల్చివేత అంశంపై దూకుడుగా సీఐడీ విచారణ జరిపింది. రెండు, మూడు రోజుల్లో ఇతర కీలక కేసుల్లోనూ సీఐడీ విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. అధికారంలోకి వచ్చినా ఏమీ చేయడం లేదనుకుంటున్న అనేక మంది వైసీపీ నేతలకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.