సిరా న్యూస్,విజయవాడ;
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎప్పుడూ దేశ రాజకీయాల కంటే ముందే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఘటలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొత్త కొత్త సంప్రదాయాలకు తెరతీస్తుంటారు ఇక్కడి నాయకులు. అక్కడ ఏం చేసినా ట్రెండ్ సెటర్‌గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ట్రెండింగ్ ఇష్యూ ఒకటి చర్చనీయాంశమవుతుంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు రెడ్ బుక్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని పాలన సాగుతోందని ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దానికి అధికార పార్టీ నుంచి ముఖ్యంగా టీడీపీ నుంచి కౌంటర్ గట్టిగానే ఉంటోంది. అందుకే వైసీపీ కూడా తామూ పుస్తకాలు రాస్తు్నామని అందరి పేర్లు నోట్ చేస్తున్నామని ప్రచారం చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న యువగళం పాదయాత్ర చేపట్టిన ప్రస్తుతం మంత్రి నాటి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రెడ్‌బుక్‌ను బాగా వాడుకున్నారు. తన చేతిలో ఉన్న రెడ్ బుక్‌ను చూపిస్తూ అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే వారి పేర్లు, కేడర్‌ను హింసించేవారి రాస్తున్నామని కచ్చితంగా ఇంతకు ఇంత చెల్లిస్తామని వారందరిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించేవాళ్లు. దానికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చేది. తర్వాత క్రమంలో రెడ్ బుక్ పేరు మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టారు. 2024 ఎన్నికల్లో దీన్నో ప్రచార అస్త్రంగా టీడీపీ వాడుకుంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ఆ రెడ్‌బుక్‌పై బాగా సెటైర్లు వేసింది. మతి మరుపు ఉన్న వ్యక్తి ఇలాంటి రాసుకుంటారని… లోకేష్‌కు అంత సీన్ లేదని విమర్శించింది. అధికారంలోకి వచ్చేది లేదు చేసేదేం లేదని కూడా ఎద్దేవా చేసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానికి వైసీపీ పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు.కాలం గిర్రున తిరిగింది. 2024లో వైసీపీ అధికారం కోల్పోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు రెడ్ బుక్ మాటను ఎన్నికల వరకు చెప్పిన టీడీపీ సైలెంట్ అయినా… వైసీపీ అందుకుంది. అంతే చేసిన ప్రతి పని వెనుక ఈ రెడ్ బుక్ ఉందంటూ ఆరోపిస్తోంది వైసీపీ. ఎవరిని అరెస్టు చేసినా, ఏ అధికారిని బదిలీ చేసినా, ఎవరిపై చర్యలు తీసుకున్నా దానికి రెడ్ బుక్ కారణమని విమర్శలు చేస్తూ వస్తోంది. దీనిపై మాట్లాడిన లోకేష్ రెడ్‌బుక్ గురించి చెప్పుకోవడానికి తామేమీ వెనకాడబోమన్నారు. ఎన్నికలకు ముందు నుంచే రెడ్‌బుక్ పట్టుకొని ఊరూరా తిరిగామని చెప్పుకొచ్చారు. ప్రజలు తమ విధానాలతోపాటు ఈ రెడ్‌బుక్‌ను చూసి కూడా ఓట్లు వేశారని అన్నారు. రెడ్‌బుక్‌లో తప్పు చేసిన వారి పేర్లు ఉన్నాయని… వారిపై చట్ట ప్రకారం చర్యలు కచ్చితంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు రెడ్‌బుక్ ను లైట్ తీసుకొని ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని బూచిగా చూపించడంతో వైసీపీపై సొంతపార్టీలోనే విమర్శలు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రెడ్ బుక్‌పై ఆరోపణలు చేస్తూనే… కేడర్‌కు ధైర్యం చెప్పేందుకు కొత్త పంథాను ఎంచుకుంది వైసీపీ అధినాయకత్వం. అందుకే తరచూ ఆ పార్టీ నేతల నోట బుక్ ప్రస్తావన వచ్చేది. ఇప్పుడు ఏకంగా అధినేత జగన్ మోహన్ రెడ్డే తాము కూడా రెడ్‌బుక్ రాయడం మొదలు పెట్టామంటున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు చేసిన తప్పులను రెడ్‌బుక్‌లో నోట్ చేస్తామంటున్నారు. అంతే కాకుండా పార్టీ కోసం కష్టపడే లీడర్ల కోసం గుడ్ బుక్ రాస్తున్నామని అన్నారు. వివిధ జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ ఈ బుక్స్‌పై స్పందించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని ఆరోపించిన ఆయన… కచ్చితంగా అన్నింటినీ, అందరి పేర్లను మా వాళ్లు నోట్ చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని చెప్పారు. రెడ్‌బుక్ మెయిటైన్ చేయడం పెద్ద కష్టం కాదని అందుకే రెండు పుస్తకాలు రాస్తున్నామన్నారు. రెడ్‌బుక్‌తోపాటు గుడ్ బుక్ ఉంటుందన్నారు. ఈ మధ్య కాలంలో నియోజకవర్గం నేతలతో మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు…”నేను గ్రీన్ బుక్ రాయడం మొదటు పెట్టా, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు పేరు గ్రీన్ బుక్‌లో రాస్తా. అధికారంలోకి వచ్చాక గ్రీన్ బుక్‌లో ఉన్న ప్రతి కార్యకర్తకు మేలు చేస్తా అని చెప్పారు. తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి బుక్ పేరు పదే పదే ప్రస్తావించేవాళ్లు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు బీఆర్‌ఎస్ వాళ్లు ఈ ప్రస్తావన చేస్తున్నారు. తప్పు చేసిన నాయకులు, అధికారుల పేర్లు నోట్ చేస్తున్నామని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు అధికార పార్టీ వ్యూహాలను చిత్తు చేయడానికో, లేదా తమ ప్లాన్ వర్కౌట్ చేయడానికో ఇలా బుక్స్ పేర్లతో రాజకీయం చేస్తుంటారు. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండు సృష్టించిందని అంటున్నారు.