సిరా న్యూస్,విశాఖపట్నం;
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పై సీబీఐకి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు సీబీఐ అధికారులను కలిసి ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ… ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు పెద్ద ఎత్తున తొలగిస్తూ సీఎం జగన్ పెద్ద స్కాం చేస్తున్నారని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని దౌర్భాగ్యపు పని జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అనైతికంగా గెలవాలని రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తానని తేల్చిచెప్పారు. జగన్ చేస్తున్న స్కాంలో జిల్లా ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు, వలంటీర్లు భాగస్వామ్యులుగా ఉన్నారని అన్నారు. నయవంచకుడు జగన్ జైల్లోనే ఉండాలి తప్ప బయట తిరగకూడదని హెచ్చరించారు. గరుడ యాప్ పెట్టి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తుందని తెలిపారు.జగన్ దొడ్డిదారిన ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నారని ఎద్దేవ చేశారు. భారత రాజ్యంగాన్ని జగన్ భ్రష్టు పట్టించారని, జగన్ బర్త్ డే నాటికి జైలుకు వెళ్లడం ఖాయమని బీవీ రామ్ హెచ్చరించారు.