కులగణనపై కాంగ్రెస్ ఆశలు

సిరా న్యూస్;

దేశ రాజకీయాలు కుల, మతం మధ్య నలిగిపోతున్నాయి. బీజేపీ చేస్తున్న హిందూత్వ రాజకీయాలకు కులం ద్వారానే కౌంటర్ ఇస్తేనే వర్కవుట్ అవుతుందన్న నిర్ణయానికి వచ్చిన రాహుల్ గాంధీ తమ పార్టీ సింగిల్ ఎజెండాగా కులగణనను తీసుకుని దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణనను ప్రతిష్టాత్మకంగా చేయిస్తున్నారు. తెలంగాణలో కులగణన ప్రారంభించే ముందు వచ్చి ఆయన ఇచ్చిన సందేశం ఈ విషయాన్ని క్లియర్ చేస్తోంది. కులగణన చేసి రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తామని ఆయన చెప్పడం ఈ వ్యూహంలో భాగం అనుకోవచ్చు. స్వతంత్ర భారతావనిలో జరిగిన ఏ ఎన్నికలను చూసుకున్నా రాజకీయ పార్టీల రాజకీయం, ఎన్నికల వ్యూహాలు మొత్తం కులం ప్రకారమే ఉంటాయి. స్వాతంత్రం వచ్చిన మొదట్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉండేది.రాను రాను కాంగ్రెస్ కేవలం ముస్లింలు, దళితల మద్దతునే నిలబెట్టుకోగలిగింది. నిజానికి చాలా రాష్ట్రాల్లో ఈ వర్గాలు కూడా వేరే పార్టీల వైపు వెళ్లిపోయాయి. యూపీ వంటి రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కనీసం వంద లోక్ సభ సీట్లు గెల్చుకోవడమే ఓ పెద్ద సవాల్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా తమ పార్టీని వదిలేసిన కులాలను ఆకట్టుకోవడానికి ఇప్పుడుకొత్తగా ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి అస్త్రమే కులగణన. దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి ఉంది. అందుకే చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇదే అంశాన్ని పట్టుకున్న రాహుల్ గాంధీ ..తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్ చట్టం ద్వారా రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి కులగణన చేపట్టి అందిరకీ అవకాశాలు కల్పిస్తామని అంటోంది. రాహుల్ గాంధీ ఈ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కులాల పరంగా అందరికీ అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. దేశంలోని అన్ని వ్యవస్థల్లో కుల వివక్ష ఉందన్నారు. రాజకీయ న్యాయవ్యవస్థల్లో ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలోని పారిశ్రామికవేత్తల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, గిరిజన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ప్రతిభ ఉన్నప్పటికీ వారికి పాలనా వ్యవస్థలో భాగస్వాములయ్యే అవకాశం కింది కులాలకు రావడం లేదన్నారు. అందువల్లే తాము కులగణన చేపట్టామని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపడుతున్న కులగణన అంటే అది కేవలం కులాల లెక్కలు కాదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు పునాది అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారని…దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా అని రాహుల్ ప్రశ్నించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలని రాహుల్ సూచించారు. కులగణన చేసినంత మాత్రాన సరిపోదు. వివిధ కులాల మధ్య సంపద పంపిణీ ఎలా ఉందో అధ్యయనం చేయాలి. అదేవిధంగా బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, మీడియాలో ఓబీసీలు, దళితులు, కార్మికుల భాగస్వామ్యం ఎంతుందో కూడా తెలుసుకోవాల్సి ఉందన్నారు. అందుకే కులగణన చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జరుపుతుందని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని స్పష్టంచేశారు బీసీ వర్గాలను ప్రధానంగా ఆయన టార్గెట్ చేసుకున్నారు. ప్రతి వర్గం తమ జనాభాఎక్కువ ఉందని తమకు ఇంకా ఎక్కువ అవకాశాలు రావాల్సి ఉందని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా రాహుల్ అదే పాయింట్ ను పట్టుకున్నారు. తెలంగాణ కులగణనలో వచ్చే ఫలితాలతో అధికారికంగా రిజర్వేషన్లు కల్పించలేకపోవచ్చు కానీ అనధికారికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించి తాము చిత్తశుద్ధితో ఉన్నామని నిరూపించి.. దేశవ్యాప్తంగా ఈ మోడల్ చూపించాలని అనుకుంటున్నారు. మరో వైపు తెలంగాణలో గత 5 ఏళ్లలో రుణాలు తీసుకుని ఉంటే.. ఏ అవసరం కోసం తీసుకున్నారు.. ఎక్కడి నుంచి తీసుకున్నారు..? వంటి వివరాలు పార్ట్‌-2లో పొందుపరిచారు. కుటుంబ సభ్యులందరి మొత్తం స్థిర, చరాస్తులతో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. వ్యవసాయ భూములు ఉంటే.. ధరణి పాస్‌బుక్‌ నంబర్‌తో పాటు భూమి రకం, నీటిపారుదల వనరు, కౌలు సాగుభూమి తదితర వివరాలను సేకరిస్తారు. చివరగా ఎన్యుమరేటర్‌కు అందించిన సమాచారం నిజమని ప్రకటిస్తూ కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది.స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది..కాంగ్రెస్‌ పార్టీ. కులగణన చేస్తామంటూ తన మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో తీర్మానం చేయడమే గాక, కులగణనకు 150 కోట్లరూపాయలు కేటాయిస్తూ జీవోకూడా జారీ చేసింది రేవంత్‌ సర్కారు.ఈ సర్వేతో పెనుమార్పులొస్తాయని ప్రభుత్వం చెబుతుంటే..విపక్షాలు మాత్రం పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వే ఎలా సాగబోతోంది? చివరికేం తేలబోతోంది? అన్నది పక్కన పెడితే సర్వే నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాక ఆసక్తికరంగా మారింది.మొత్తంగా కులంతో బలపడాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు ఎంత వరకూ నమ్ముతారో మరి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *