ఆ ఇద్దరూ అంతేనా…

సిరా న్యూస్,హైదరాబాద్;
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. అంతకు ముందు ముఖ్యమంత్రులుగా ఉన్న వారు ఇద్దరూ మాజీలుగా మారిపోయారు. అయితే ఇద్దరికీ అసెంబ్లీ సమావేశాలకు రావడానికి మాత్రం తీరిక ఉండటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రతిపక్షాన్ని శాసనసభలో ఒక ఆటాడుకున్న ఈ నేతలిద్దరూ ఇప్పుడు అసెంబ్లీ అంటేనే భయపడిపోతున్నారు. ఒకరు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కాగా, మరొకరు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లు. ఇద్దరూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వస్తే అధికార పక్షం నుంచి తాము విమర్శలను, సెటైర్లను ఎదుర్కొనాల్సి వస్తుందన్న కారణంతోనే ఇద్దరు నేతలు దూరంగా ఉండిపోతున్నారు. అయితే శాసనసభకు వచ్చి తమ గళం వినిపించాల్సిన నేతలు ఇద్దరూ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్ లో వ్యవహరించారు. అంతా తామే అయినట్లు సభను నడిపారు. నాడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు సభకు హాజరయ్యారు. అలాగే ఏపీలోనూ చివరి సమావేశాల వరకూ చంద్రబాబు నాయుడు సభలకు వచ్చి తమ పార్టీ తరుపున నిరసన గళం వినిపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఠంఛనుగా సభకు వచ్చేవారు. అలాగే నాడు ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభ్యులు సభకు వస్తున్నారు. కానీ పార్టీ చీఫ్‌లు మాత్రం సభకు గైర్హాజరవుతున్నారు. సభకు వచ్చినంత మాత్రాన జరిగే నష్టం లేదు. ఏదైనా జరిగితే ఎంతో కొంత ప్రయోజనమే ఉంటుంది. అధికార పార్టీ సభలో శృతి మించి విమర్శలు చేసినా సానుభూతి పుష్కలంగా వస్తుంది. ఆ ఛాన్స్ ను ఇద్దరు నేతలు మిస్ చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సభకు వచ్చి కూర్చుంటే ఆ హుందాతనం వేరేగా ఉంటుంది. ఒకవేళ అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినా అతి తనకు అనుకూలంగా మలచుకునే వీలుంది. అలాగే జగన్ కూడా అంతే. పదకొండు మంది సభ్యులయితేనేం. తమ గళాన్ని వినిపించి వాకౌట్ చేసి బయటకు రావచ్చు. కానీ ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ లు ఇద్దరూ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయి తప్పు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వారి పార్టీ కార్యకర్తలే కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *