“చెయ్యే”త్తిన ఓటర్లు…కారుకు బ్రేకులు… కానరాని బిజెపి, బీఎస్పీ…

కాంగ్రెస్ కు 50 వేల మెజార్టీ దాటుతుందంటున్న రాజకీయ విశ్లేషకులు

సిరాన్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి నియోజకవర్గంలో అంతా అనుకున్నట్లుగానే వార్ వన్ సైడ్ గా సాగింది. చెయ్యి గుర్తుకు ఓటేసేందుకు ఓటర్లు ఆసక్తి కనపరిచారు. ఏమాత్రం బిఆర్ఎస్ పార్టీ తన ప్రభావాన్ని చూప లేకపోయింది. ఇక బిజెపి, బీఎస్పీ పార్టీల విషయానికి వస్తే ఓటర్ ను ఆకట్టుకోవడంలో సఫలీకృతం కాలేకపోయారు. మొదటిది బీజేపీ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం కావడం, ప్రచారంలో ప్రజల్లోకి చొచ్చుకో లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక బీఎస్పీ అభ్యర్థి విషయంలో ముందుగానే ప్రచారం మొదలు పెట్టినా తమ వారి ఒంటెద్దు పోకడలు ఉష పుట్టి ముంచినట్లు పేర్కొంటున్నారు. అసలు విషయంలోకి వస్తే ప్రధాన పోటీ ఉంటుందకున్న కాంగ్రెస్, బీఆర్ ఎస్ అభ్యర్థులు మొదటి నుండి తమదైన శైలిలో ప్రచారాలు చేస్తూ ప్రజల మధ్యలో ఉన్నారు. వారి వారి స్థాయిల్లో ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింత కుంట విజయరమణ రావు జోష్ పెంచారు. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఒక స్థాయిలో అన్ని వర్గాల మద్దతును కూడగట్టడంలో విజయ రమణ రావు కృతకృతులయ్యారు. ఇద్దరి మధ్యన పోటీ ఉందనుకుంటున్న క్రమంలో వార్ వన్ సైడ్ గా నిలిచింది. టిఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టలేకపోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 50వేల పైచిలుకు మెజార్టీ రావచ్చని రాజకీయ విశ్లేషణల అంచనా. ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విజయ రమణారావు ఈ దఫా విజయం సాధించారని చెప్పవచ్చు. డబ్బుల పంపిణీ మద్యం లేకున్నా కూడా చాలా మంది ఆయన మీద ఉన్న అభిమానం, సానుభూతి ఈసారి కలిసొచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక స్థాయిలో విజయరమణ రావు గెలుస్తాడనే ప్రచారం సాగిన తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. చివరి రోజు ఓటర్లను ప్రభావితం చేసే క్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెనుకడుగు వేశారని జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విషయంలో కొంతమంది కౌన్సిలర్లు డబ్బులు, మద్యం చేయగా, మరి కొంతమందికి పంపిణీ చేయలేదనే ఆరోపణ వినిపించాయి. అయినా కూడా ఎక్కడ కూడా ప్రజలు డబ్బులు మద్యం కోసం కాకుండా స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీకే ఓటేశామని పేర్కొనడం గమనార్హం. ఓ కౌన్సిలర్ రూ. 6 లక్షలు తీసుకొని వాటిని పంపిణి చేయకుండా సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అక్కడి క్రింది స్థాయి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, వెళ్లి నిలదీస్తే మద్యం మత్తులో తూగడం కొస మెరుపు. అయినా కూడా ఇదంతా టిఆర్ఎస్ అభ్యర్థి పై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై ఉన్న సానుభూతి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా నమ్ముకున్న ప్రజలు విజయరమణకు న్యాయం చేస్తే, మరి ఆయనను నమ్ముకున్న ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏం న్యాయం చేస్తాడో చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *