సిరా న్యూస్,వరంగల్;
దట్టమైన అటవీ ప్రాంతం… చుట్టూ కొండలు మధ్యలో లక్నవరం సరస్సు. టూరిస్ట్ స్పాట్ గా కొనసాగుతున్న ఆ అందాలను ఆస్వాదించాలంటే లక్నవరం వెళ్లాల్సిందే. కాకతీయులు సాగునీటి కోసం నిర్మించిన సరస్సు నేడు తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయరాజు రెండో ప్రతాపరుద్రుడు లక్నవరం తవ్వించాడు. నాటి నుంచి నేటి వరకు లక్నవరం సరస్సు రైతులపాలిట వర్రపదాయినిగా ఉంటోంది. ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లాలోని గోవిందరావుపేట మండలం లోని బుస్సాపూర్ గ్రామం దగ్గరలో ఉంది.కాకతీయుల కాలంలో సాగు నీరు కోసం లక్నవరం సరస్సును నిర్మించారు. దాదాపు పదివేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సులో పదమూడు ఐలాండ్స్ ఉన్నాయి. టూరిస్ట్‌లు ఈ లక్నవరం అందాలను ఎంజాయ్ చెయ్యడానికి చుట్టూ కొండలు మధ్యలో ఉన్న లక్నవరం సరస్సుపై పొడవైన రెండు వ్రేలాడే వంతెనలు, సరస్సులో బోటు షికారు. స్పీడ్ బోట్ తోపాటు సైక్లింగ్ బోటుతో పర్యాటకులు ప్రకృతి అందాలను చుట్టేసి రావచ్చు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ప్రకృతి ఒడిలో గడపడానికి సరస్సు మధ్యలో అందమైన కాటేజీలు, ఘుమఘుమలు పంచే రెస్టారెంట్, ఇవన్నీ కలగలిపి సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్ కార్యక్రమం నిర్వహిస్తారు. యూత్ కోసం అడ్వెంచర్ గేమ్స్ ను అందుబాటులో తీసుకువచ్చింది పర్యాటక శాఖ. ఇవి లక్నవరం సరస్సు సొంత కాటేజీలను హరిత కాకతీయ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి.లక్నవరం అందాలను చూడడానికి రోడ్డు మార్గంలో వెళ్లాలి. వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో లక్నవరం సరస్సు ఉంటుంది. వరంగల్ నుంచి బయల్దేరి ములుగు, బుస్సా పూర్ మీదుగా లక్నవరం చేరుకుంటాము. హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ నగరం మీదుగా లక్నవరం చేరుకోవడానికి సుమారు 230 కిలోమీటర్లు వస్తుంది. లక్నవరం అందాలను చూడడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు రైలు మార్గం ద్వారా వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లకు చేరుకొని అక్కడి నుంచి లక్నవరం చేరుకోవచ్చు.పర్యాటకులు లక్నవరం వెళ్లే ముందు… లేదంటే లక్నవరం పర్యటన ఊహించుకొని తిరుగు ప్రయాణంలో వరంగల్ నగరంలోని కాకతీయుల రాజధాని వరంగల్ కోట, భద్రకాళి టెంపుల్, వేయి స్తంభాల దేవాలయం ను వీక్షించవచ్చు. ఇవన్ని 5 నుంచి 10 కిలోమీటర్ల మద్యలో ఉంటాయి.