సిరా న్యూస్,హైదరాబాద్;
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా..పెద్ద ఎత్తున నిరసనకు రెడీ అవుతోంది. ఇచ్చిన హామీలేంటి.? అమలు చేసిందేంటి.? అంటూ అధికార కాంగ్రెస్‌ను నిలదీసేందుకు..భారీ కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అపోజిషన్ రోల్‌లో తగ్గడం లేదు బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పడు ఎక్స్‌పోజ్ చేస్తూనే ఉంది. అయితే వన్ ఇయర్ టైమ్ ఇవ్వాలనే ఆలోచనతో ఎక్కువగా దూకుడు ప్రదర్శించడం లేదు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు అయిపోతుంది. వచ్చే నెల 7వ తేదీ నాటికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. అప్పటినుంచి దద్దరిల్లిపోవాల్సిందేనంటోంది బీఆర్ఎస్. అధికార పార్టీ వైఫల్యాలపై మరింత బలంగా పోరాడాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆందోళనలు, సభలు, సమావేశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్లాన్ చేస్తోంది.ఆరు గ్యారెంటీలు.. 420 హామీల కథేంటని ఇప్పటికే..అధికార పార్టీని కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. ఓవైపు కేటీఆర్..మరోవైపు హరీశ్‌రావు..పార్టీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై గళం వినిపిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి ఆందోళనలకు బీఆర్ఎస్ రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, 4 వేల పెన్షన్, మహిళలకు నెలకు 2500, ఉద్యోగాల భర్తీపై గట్టిగనే పోరాడాలని ఫిక్స్ అయ్యారట. డిసెంబర్ 7నాటికి రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాది అవుతుందని అప్పటి నుంచి అసలు సీన్ ఏంటో చూపిస్తామంటున్నారు గులాబీ నేతలు. బాస్ కూడా రంగంలోకి దిగుతారని..అప్పుడు అధికార కాంగ్రెస్‌కు ఆందోళనల రుచేంటో చూపిస్తామంటున్నారు.ప్రజల సమస్యలపై ప్రజాక్షేత్రంలోనే ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది బీఆర్ఎస్. 11 నెలలుగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న గులాబీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సంవత్సరికం పేరుతో సభ నిర్వహించాలన్న యోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేకంగా పాటలు కూడా సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక బృందం పాటల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు..వాటి అమలు, ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యమ సమయంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సాంస్కృతిక బృందాలతో ప్రత్యేకంగా వీడియోలు రూపొందించే పనిలో గులాబీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి ప్రభుత్వం ఏయే రంగాల్లో విఫలమైందో వివరించే ప్రయత్నం చేస్తున్నారట. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం రంగం ఎలా ఉండే..ఇప్పుడెలా ఉంది.? ఐటీ పరిస్థితి ఏంటి.? ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉంది.? రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ప్రభుత్వ వైఫల్యాలు ఎలా ఉన్నాయి..ఇలా అన్ని అంశాలు ప్రజలకు అర్థమయ్యేలా సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేయబోతున్నారట.అందుకోసం ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసి పెట్టినట్లు సమాచారం. రెండు విడతల బీఆర్ఎస్ పాలనను వివరిస్తూ… ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఎండగట్టే విధంగా కార్యాచరణను రెడీ చేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ వన్ ఇయర్ పాలనపై బిగ్ ప్రొటెస్ట్ చేపట్టి..ఆ తర్వాత మరింత దూకుడుగా వెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోంది.