సిరాన్యూస్, ఇచ్చోడ
ఎస్సీ క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలి
* దళిత వికాస సమితి రాష్ట్ర అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ
* ఇచ్చోడకు చేరుకున్న పాదయాత్ర
ఎస్సీ క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని దళిత వికాస సమితి రాష్ట్ర అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ అన్నారు. దళిత వికాస్ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ దళిత వికాస్ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 10 వరకు, పది రోజులపాటు అదిలాబాద్ నుండి జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ వరకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు గత 70 సంవత్సరాలుగా కొన్ని కుటుంబాలు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో అనుభవిస్తున్న వారి పిల్లలే అందవిస్తున్నాయన్నారు. ఎస్సీలలో మూడు శాతం మంది మాత్రమే సంపన్న వర్గంగా ఎదిగారన్నారు. వీరి కుటుంబాలే మళ్లీ మళ్లీ రిజర్వేషన్లు ఫలాలు పొందుతున్నారన్నారు. వీరందరికీ ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేయకుండ ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకునే అధికారం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినందున రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిధిలో ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానం అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు వల్ల కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఉద్యోగ రంగంలో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూపు వన్, గ్రూప్ టూ ఉద్యోగాలు పొందిన వారి పిల్లలకు రిజర్వేషన్ వర్తించడం వల్ల ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎస్సీలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే క్రిమిలేయర్ ను వర్తింపజేస్తూ చట్టం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొల్లూరు వినోద్, కొత్తూరు మల్లేష్, మచ్చ నగేష్, ప్రవీణ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.