సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ నగరంలోని గిర్మాజీపేట గోవిందరాజస్వామి అర్చకుడు వరయోగుల మురళీకృష్ణ స్వామిపై జరిగిన దాడిని ధార్మిక చాత్తాద శ్రీవైష్ణవ సమైఖ్య వేదిక తీవ్రంగా ఖండించింది. కొందరు రాజకీయనాయకులు కొంతకాలంగా ఆలయభూములను అన్యాక్రాంతం చేసేందుకు అర్చకులపై దాడులకు తెగబడతున్నారని సమైఖ్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. అనువంశికంగా వస్తున్న ఆలయాల్లో అర్చకులుగా వారే కొనసాగాలని పేర్కొంది. అర్చకుడిపై దాడిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ చింతాకుల అనిల్ కుమార్, సునీల్ ల పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సమైఖ్యవేదిక డిమాండ్ చేసింది. దాడి జరిగిన ఘటనపై ధార్మిక చాత్తాద శ్రీవైష్ణవ సమైఖ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తోమాల కొండస్వామి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరునగరి వెంకటరమణ, ఉపాధ్యక్షులు తిరుకోవెల కేశవ్ కుమార్, కోశాధికారి తోమాల వేణు తదితరులు పాల్గొని అర్చకుడు వరయోగుల మురళీకృష్ణస్వామిపై దాడిని ఖండించారు. ఆలయంలో అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని మాత్రమే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. నూతనంగా కొంతమంది అర్చకులను నియమించి వారితోనే చేయించాలని చేస్తున్న కుట్రలను నిలిపివేయాలన్నారు. అనాదిగా దేవుడిని నమ్ముకుని నిత్యదీపారాధన చేస్తున్న అర్చకుల పొట్ట కొట్టొద్దన్నారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖగారి ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం పట్ల సమైఖ్యవేదిక సభ్యులు మండిపడ్డారు. అర్చకుడిపై దాడి చేయడమంటే భగవంతునిపై దాడిచేయడమేనన్నారు. స్థానిక ఇంతేజార్ గంజ్ పోలీసులు సైతం అర్చకులు అందజేసిన ఫిర్యాదుపై స్పందించి సదరు నాయకుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. కొంతకాలంగా తెలంగాణలోని అనువంశిక ఆలయాల్లో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ఇందుకోసం ఆక్రమణదారులు ఎంతటికైనా తెగిడిస్తున్నారన్నారు. ఇటువంటి వారిపై కఠినంగా చర్యలుతీసుకుంటేనే మరో చోట ఇలాంటి ఘటనలు జరగవని తెలిపారు. గోవిందరాజస్వామి ఆలయభూములను కూడా కాపాడాలని కోరారు.
మంత్రి కొండాసురేఖ దృష్టికి….
ఈ ఘటనపై ధార్మిక చాత్తాద శ్రీవైష్ణవ సమైఖ్య వేదిక రాష్ట్ర మంత్రి కొండా సురేఖగారిని కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. అదే విధంగా తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో అర్చకులకు భద్రత కల్పించాలని కోరుతామని చెప్పారు. అనువంశికంగా వచ్చే ఆలయాలభూముల జోలికి వచ్చినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖగారి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ధార్మిక చాత్తాద శ్రీవైష్ణవ సమైఖ్య వేదిక వెల్లడించింది.