– అంగన్వాడీలు, కేజీబీవీ సిబ్బందికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భరోసా..
– ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరిపై మండిపాటు..
సిరా న్యూస్,శ్రీకాకుళం;
డిమాండ్ల సాధనకు సమ్మె బాట పట్టిన అంగన్వాడీ ఉద్యోగులు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల సిబ్బందిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఉదాసీన వైఖరి వదిలి, ఉద్యోగుల సంక్షేమానికా కృషి చేయాలని హితవు పలికారు. ఉద్యోగులకు తనతో పాటు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు, కేజీబీవీ చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. వారికి సంఘీభావం తెలిపి, మాట్లాడారు. గత 18 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 10 వేలమంది ఉద్యోగులు రోడ్డు పైనే ఉన్నారని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం చీమ కుట్టినట్లు కూడా వ్యవహరించక పోవడం, అంగన్వాడీ వ్యవస్థను చిన్నచూపు చూడటమేనని విమర్శించారు. కనీసం సరైన రీతిలో చర్చలకు కూడా ఆహ్వానించక పోవడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరుతో ఉద్యోగుల కుటుంబాలతో పాటు కేంద్రాల్లోని చిన్నారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విద్య, ఉపాధ్యాయులు, బోధనా సిబ్బందికి ఎంతో విలువ ఇచ్చేవారని ఎంపీ గుర్తు చేశారు. అయితే… ప్రస్తుత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అంటే కేవలం రంగుల గదులకే పరిమితం చేశారని ఆక్షేపించారు. నెలనెలా జీతాలు కూడా చెల్లించకుండా ఉద్యోగును ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.