సిరా న్యూస్,నెల్లూరు;
ఏపిఎస్ఆర్టిసి ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే అన్ని కష్టాలకూ కాలం చెల్లుతుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఆర్టిసి ఉద్యోగుల కష్టాలు తగ్గకపోగా, గతం కంటే పెరగడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసిలో వున్నపుడు ఉద్యోగికి ఏ సమస్య వచ్చినా నేరుగా యజమాన్యంతో చెప్పుకునే వెసులుబాటు వుండేది. ఇప్పుడు ఆర్టిసి ఎమ్‌డికి వినతి ఇచ్చినా ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పడం తప్ప పరిష్కారానికి చొరవ తీసుకునే వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఒపిఎస్ వస్తుందని ఆశపడ్డా.. అది ఇవ్వలేమని సిపిఎస్ గానీ జిపిఎస్ గానీ తీసుకోవాలని యజమాన్యం చెబుతోంది. సిపిఎస్, జిపిఎస్ కంటే ఇపిఎఫ్ ద్వారా వచ్చే పెన్షన్ మేలని ఉద్యోగులు ఎక్కువ మంది అటువైపు మొగ్గుచూపుతున్న పరిస్థితి వుంది. అలాగే సరెండర్ సెలవులకు సంబంధించి ప్రభుత్వం మూడేళ్లుగా బకాయిలు పెట్టింది. అన్ని ప్రభుత్వశాఖల తరహాలో ఉద్యోగోన్నతులు కల్పించాలని ఎప్పట్నుంచో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 8వ తరగతి అర్హతతో డ్రైవర్, 10వ తరగతి అర్హతతో కండక్టర్లు ఆర్టిసిలో ఎక్కువగా వున్నారు. ఎడిసి, ట్రాఫిక్‌లలో ఇచ్చే ఉద్యోగోన్నతుల్లో ఇప్పటి దాకా సగటున 25 ఏళ్లు దాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగోన్నతులు లభించేవి. అయితే ప్రభుత్వంలో విలీనమయ్యాక ఎడిసి పోస్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టుతో సమానమని, డిగ్రీ వుంటేనే ఉద్యోగోన్నతి అంటూ ఆర్టిసి యాజమాన్యం చెప్పడంతో ఆర్‌టిసిలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. విద్యార్హతతో ప్రమేయం లేకుండా పాతపద్ధతిలో ఉద్యోగోన్నతులకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసిలో పాత నిబంధనలతోనే ఉద్యోగోన్నతులు కల్పించేలా ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ ఉత్తర్వులు అమలు చేయని పరిస్థితి వుంది. అంతేకాకుండా ఆర్టిసి ఉద్యోగులకు అన్ని రకాల అలవెన్సులు ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి నిలిపేశారు. అలవెన్సుల అంశంలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ఆరోగ్య సమస్యల అంశంలోనూ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.