సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు అసలైన విషయాలపై స్పందించడం లేదు. ముఖ్య నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. ఈ పరిమామం వల్ల అసలు బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా వరదల విషయంలో కేందాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. అవసరమైన హెలికాఫ్టర్లు, పవర్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించలేదని ప్రజల్ని గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటిని తెలంగాణ బీజేపీ నేతలు కూడా తిప్పికొట్టలేకపోతున్నారు. మామూలుగా అయితే ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్‌లో ఎదురుదాడి చేయవచ్చు . కానీ ఎవరికి వార తమకెందుకు అనుకుంటున్నారు. అందు వల్లే ఎవరూ ముందుకు రావడం లేదు. ఖమ్మంకు ఆ స్థాయిలో వరద వస్తుందని ప్రభుత్వం ఊహించలేకపోయింది. బుడమేరు విజయవాడను ముంచింది కాబట్టి… ఆ నీరు ఖమ్మం వైపు వస్తుందని అంచనా వేయలేకపోయారు. చివరికి మున్నేరు పెద్ద ముప్పు తెచ్చి పెట్టింది. ఆరేడు అడుగుల ఎత్తున నీరు పారడం అంటే చిన్న విషయం కాదు. మామూలుగా అయితే గోదావరికి వరదలు వస్తే.. ఖమ్మం జిల్లా ఉలిక్కి పడుతుంది. ఈ సారి మాత్రం భిన్నం. అందుకే ప్రభు్తవం పెద్దగా చర్యలు తీసుకోలేకపోయింది. కేంద్రాన్ని కూడా అప్పటికప్పుడు అడిగి ఎలాంటి డిజాస్టర్ రిలీఫ్ చేపట్టలేకపోయింది. హెలికాప్టర్లు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత రోజే రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు వెళ్లినప్పటికీ.. ప్రభుత్వం పెద్దగా ఏమ చేయలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఖమ్మంలో ఎలాగూ వైఫల్యం చోటు చేసుకుంది..దాని కారణాన్ని కేంద్రంపై నెట్టేస్తే బెటరనుకుని ఆ పని ప్రారంభించారు. విపత్తు వచ్చినా కేంద్రం కనీసం హెలికాప్టర్ల పంపలేదని.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపలేదని ఆరోపణలు చేయడం ప్రారంభించారు. పక్కన ఉన్న రాష్ట్రానికి 120 పవర్ బోట్లు, హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ కూడా సాయానికి వెళ్లిందని తెలంగాణకు ఒక్కరు కూడా రాలేదని అది కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమేనని బీఆర్ఎస్ విమర్శించింది. అయితే ఇది బీజేపీకి సూటిగా తగిలింది. బీజేపీని ఏమీ అనలేని నిస్సహాయత వల్ల కాంగ్రెస్ ను కేటీఆర్ విమర్శించి ఉండవచ్చు కానీ.. కేంద్రం ఏమీ చేయలేదంటే అది బీజేపీ మీదకే వెళ్తుంది. తమపై వస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ చేయలేకపోతోంది. దీనికి కారణం సమాధానం లేకపోవడం కాదు. నేతలు పెద్దగా పట్టించుకోకపోవడమే. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క లీడర్ కూడా బాధ్యత తీసుకోవడం లేదు. ఫలితంగా బీజేపీపై వచ్చిన విమర్శలు మరకలుగానే పడిపోతున్నాయి. ఎవరికి వారు సౌంత ఎజెండా ప్రకారం స్పందించాల్సి వచ్చినప్పుడు స్పందిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర బీజేపీ కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పార్టీ నేతల్ని అలా వదిలేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.