సిరా న్యూస్, ఆదిలాబాద్
రైతులను తప్పుదోవ పట్టిస్తుస్న సీఎం రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి జోగు రామన్న
* డీఎస్పీ జీవన్ రెడ్డికి వినతి పత్రం అందజేత
రైతు రుణమాఫీ పేరిట రైతాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జోగురామన్నమాట్లాడారు. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ పేరిట రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రిపై సైతం కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరముందని, మంత్రులు సైతం ఈ విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతు న్నారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత కల్పిస్తామని స్వయంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ సంగతేంటని ప్రశ్నించారు. అసత్య ప్రచారాలు, బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడంలో మాత్రం తడబడుతోందని అన్నారు. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు.రైతులను మోసానికి గురి చేసిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ జీవన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. సమావేశంలో జిల్లా సమన్వయ అధ్యక్షులు రోకండ రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఇజ్జగిరి నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ లు, మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగరావు, కుమ్ర రాజు, నవాతే శ్రీనివాస్,ఆసిఫ్,తదితరులు పాల్గొన్నారు.