EX Minister Joguramanna: కేటీఆర్ చేపట్టే రైతు ఐక్యవేదిక సభకు తరలి రావాలి:  మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
కేటీఆర్ చేపట్టే రైతు ఐక్యవేదిక సభకు తరలి రావాలి:  మాజీ మంత్రి జోగు రామన్న

బూటకపు హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలపై బీఆర్ఎస్ రైతు ఐక్యవేదికను ఏర్పాటు చేసి ఉద్యమబాట పట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు.ఆదిలాబాద్‌ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఈనెల 24 న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పాల్గొననున్న సభ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగి పోయాయని, రైతు భరోసా ఎగ్గొట్టి ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటోoదన్నారు. ఆరు గ్యారంటీలను చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయిందన్నారు. కాంగ్రెస్ 300 రోజుల పాలనలో ఇప్పటికీ 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా, పెన్షన్ల పెంపు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలను బుట్టదాఖలు చేశారన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా కాబినెట్ సబ్ కమిటి పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ లో పండించే అత్యంత నాణ్యమైన పత్తికి గుజరాత్ కంటే తక్కువ ధరను కల్పించినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ధర్నాలు చేపడుతున్న తమపై కేసులు నమోదు చేస్తున్నారన్న ఆయన… అబద్దపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం పై కేసులు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. ఈనెల 24న రాం లీలా మైదానంలో ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్ శంఖారావం పూరించనున్నారని, ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్, పట్టణ అధ్యక్షులు అజయ్, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్, కుమ్రా రాజు,వేణుగోపాల్ యాదవ్, పరమేశ్వర్,నవతే శ్రీనివాస్, సోనేరావ్, ఐయూబ్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *