చివరకు నవీన్ కుమార్ ఖాళీ చేశారు..

సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఇంటిని.. ప్రస్తుత ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఖాళీ చేశారు. తన ఇల్లును ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని, ఐపీఎస్ అధికారిపై భన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. భన్వర్ లాల్ గతంలో ఎన్నికల కమిషన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. భన్వర్ లాల్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‎ను అదుపులోకి తీసుకొని విచారించారు సెంట్రల్ క్రైం పోలీసులు. ఈ ఇంటి వివాదంపై నవీన్ కుమార్‎కు నోటీసులు ఇచ్చారు. పోలీసుల కేసుతో ఒకసారి షాక్‎కు గురైన నవీన్.. విషయం వివాదాస్పదంగా మారుతుండటంతో భన్వర్ లాల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు.అసలు విషయంలోకి వెళితే.. ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్‌ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ బిల్డింగ్‌ ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి సాంబశివరావు అనే వ్యక్తితో 5 ఏళ్లకు రెంటల్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్‌లాల్‌ ఆరోపిస్తున్నారు. 2019 తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్‌ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. దీంతో తమ ఆస్తులకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారని భన్వర్‌లాల్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్‌ కలిసి తయారు చేశారని, వీటికి ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ సహకరించారన్నది భన్వర్‌ లాల్‌ ఆరోపణ.భన్వర్‌లాల్‌ కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సెంట్రల్ క్రైం పోలీసులు.. డాక్యుమెంట్లను పరిశీలించారు. అవి నకిలీవని తేల్చారు. డిసెంబర్‌ 22న సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్‌ ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్‌ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి రావడంతో గుట్టు చప్పుడు కాకుండా భన్వర్ లాల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *