సూపర్ సిక్స్ కోసం..

అక్షరాల లక్షా20 వేల కోట్లు…
సిరా న్యూస్,గుంటూరు;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలోనూ చంద్రబాబు నాయుడు దీనిపై స్పష్టత ఇచ్చారు. తాము సూపర్ సిక్స్ ను అమలు చేసి తీరుతామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నామని చెప్పిన ఆయన ప్రజలకు ఇచ్చిన మాట నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు వెళ్లబోమని తెలిపారు. సూపర్ సిక్స్ లో అనేక హామీలున్నాయి. అందులో పింఛన్లు అమలు చేశారు. నెలకు నాలుగు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం విజయం సాధించిన మరుసటి నెల నుంచే అమలు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతుంది. దీపావళికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు ఏడాదికి మూడు వేల రూపాయలు ఖర్చవుతుంది. జనవరి నెల నుంచి అమలు చేయాలని భావిస్తున్న తల్లికి వందనం పథకానికి పదిహేడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది. అయితే ఆర్థిక శాఖ అధికారులు సూపర్ సిక్స్ అమలు కోసం ఎంత మేర ఖర్చవుతుందన్న దానిపై లెక్కలు వేస్తున్నారని తెలిసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి 1.20 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాధమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సుమారు 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే అదనంగా మరో నలభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయితే వీటిని ఎక్కడి నుంచి తేవాలన్న దానిపై ఆర్థిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. Also అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా రాష్ట్రం నుంచి ఆదాయ వనరుల సమీకరణ ఎలా? అన్న దానిపైనే ఈ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఎటూ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు వస్తాయి. దానికి ఇబ్బంది లేదు. మరో ప్రభుత్వ ప్రాధాన్యత ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు మాత్రం నిధుల సమీకరణ చేయాల్సి ఉంటుంది. నెలవారీ అప్పులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వోద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లించడానికి పోతే రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి అదనంగా చాలా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది ఎఫ్ఆర్‌ఎంబీ కి లోబడి రుణాలను పొందాల్సి ఉంటుంది. అలాగే దానిని మించితే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం అనుమతి ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. త్వరలోనే ఏపీ శాసనసభలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపు పై స్పష్టత ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుంది. శాఖల వారీగా ఆదాయాన్ని పెంచుకోవడం ఒక మార్గమని భావిస్తుంది. అయితే అదే సమయంలో ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపు మార్గాల కోసం అన్వేషిస్తున్నారు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత కొద్ది రోజులుగా ఈ కసరత్తు జరుగుతుందని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *