సిరా న్యూస్,తిరువనంతపురం;
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలుగకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. 40 రోజుల్లో శబరిమలకు 204 కోట్ల ఆదాయం సమకూరింది. కానుకల రూపంలో 64 కోట్లు వచ్చినట్టు ట్రావెన్ కోర్ ప్రకటించింది. మరోవైపు వర్చువల్ క్యూ బుకింగ్ల సంఖ్య 90 వేలు దాటింది. స్పాట్ బుకింగ్లతో దాదాపు 10,000 మంది భక్తులు రావడంతో రానున్న రెండు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు శబరిమలకు రానున్నారు. దీంతో పాటు దాదాపు 20 వేల మంది ఎలాంటి బుకింగ్ లేకుండానే శబరిమలకు చేరుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 15గంటలకు పైగా సమయం పడుతోంది.మరోవైపు రద్దీ అంతకంతకూ పెరుగుతోంది.- పంబ వరకు దారులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక అయిదు చోట్ల అయ్యప్ప భక్తుల వాహనాలను అడ్డుకుంటున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పాలా, పొన్కున్నం, ఏటుమనూరు, వైకోమ్, కంజిరిపల్లిలో వాహనాలను అడ్డుకుంటున్నట్టు వివరించింది. వాహనాలను అడ్డుకునే సమయంలో భక్తులకు సరిపడా ఆహారం, నీరు అందేలా చూడాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే పోలీసు ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం ఈ విషయంలో సక్రమంగా సమన్వయం చేసుకోవాలని సూచించింది.కేరళ హైకోర్టు ఆదేశాల క్రమంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు దృష్టిసారించారు. రద్దీ దృష్ట్యా వాహనాలను ఆపితే ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రోన్ల సహాయంతో ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు చేపడుతున్నారు పోలీసులు. రద్దీని క్రమబద్దీకరించేలా చర్యలను ముమ్మరం చేశారు.