సిరా న్యూస్,రంగారెడ్డి;
హైదరాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం లో దేవుడి విగ్రహాల ధ్వంసం ఘటనను మర్చిపోకముందే నగర శివారులోని శంషాబాద్ లో మరో దేవాలయం పై గుర్తు తెలియని దుండగులు దాడి కి పాల్పడడం కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి హనుమాన్ దేవాలయం లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు నవగ్రహాలను రాళ్లతో ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి నవగ్రహాల ధ్వంసాన్ని చూసి గ్రామస్తులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. దుండగులు రాళ్లతో విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా ఆనవాళ్లు లభించాయి. ఈ మేరకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఘటనను కాలనీవాసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు