సిరా న్యూస్,విజయవాడ;
ఏపీ బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? కొద్ది నెలల కిందట పార్టీ అంటూ హడావిడి చేశారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఏపీలో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీలో ప్రధాన సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుంటూ.. పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావించారు. అందుకు తగ్గట్టుగానే కొందరు మాజీ ఐఏఎస్అధికారులు పార్టీలో చేరారు. హైదరాబాద్ వేదికగా కీలక సమావేశాలు నిర్వహించారు. అయితే తాజాగా బీఆర్ఎస్ ఓటమితో ఆ నేతలంతా నైరాశ్యంలో మునిగిపోయారు.తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న తన పార్టీని భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చారు. ఏపీ తో పాటు ఒడిశా, మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలని చూశారు. కొంతమంది నేతలను సైతం పార్టీలో చేర్చుకున్నారు. ఒడిశాలో అయితే మాజీ సీఎం గిరిధర్ గోమాంగో లాంటి నేతలను చేర్చుకొని పార్టీని విస్తరించాలని భావించారు. అయితే ఎందుకో అనుకున్నంత స్థాయిలో విస్తరించలేకపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఓటమితో జాతీయ పార్టీగా విస్తరణ సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ఏపీలో జగన్ మిత్రుడు గా ఉన్నారు. చంద్రబాబుతో ఒక రకమైన సంవాదాన్ని పెంచుకున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ కు మేలు చేయడం, జాతీయ పార్టీగా విస్తరించాలన్న ధ్యేయంతో ఏపీలో బీఆర్ఎస్ కార్యవర్గంతో పాటు కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారథి వంటి నేతలు సైతం బీఆర్ఎస్ లో చేరారు. కాపు సామాజిక వర్గంతో పాటు వెలమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిబలం పెంచుకోవాలని ఆలోచన చేశారు. అది అంతిమంగా జగన్ కు ప్రయోజనం చేకూర్చుతుందని.. టిడిపి, జనసేన లకు నష్టం చేకూర్చుతుందని భావించి.. చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా జనసేన నేతలను టార్గెట్ చేసుకొని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ఓటమితో సీన్ మారింది.ఏపీలో దూకుడుగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని భావించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి సానుకూలంగా లేదు. బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా విశాఖలో కానీ.. విజయవాడలో కానీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అటు మహారాష్ట్రలో సైతం కెసిఆర్ సభలు నిర్వహించారు. ఇంతలో తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. దీంతో తెలంగాణ రాజకీయాలపైనే కెసిఆర్ దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. జాతీయ పార్టీ విస్తరణ అనేది అంత సాధ్యమయ్యే పని కాదని… ఆ భావజాలం నుంచి తప్పుకుంటేనే కెసిఆర్ తెలంగాణలో పార్టీని నిలబెట్టగలరన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అలా చేస్తేనే జాతీయ పార్టీలు సైతం మద్దతు తెలిపే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.