గంటాకు చెక్ పెట్టే యత్నం
సిరా న్యూస్,విశాఖపట్టణం;
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ నగరానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన అతిపెద్ద మహా నగరంగా గుర్తింపు పొందింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు విశాఖ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైంది. ఆ సాగర తీర నగరాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన జగన్.. మరో సారి అధికారంలోకి వస్తే అక్కడ నుంచి పాలన సాగించాలని భావించారు. అక్కడ నివాసానికి రుషికొండపై అధునాత ప్యాలెస్ కూడా కట్టుకున్నారు. అయితే వైసీపీ ఆశలు గల్లంతై కూటమి అద్భుత విజయం సాధించింది. విశాఖ ఎంపీ సీటు సహా ఎమ్మెల్యేలుగా కూడా కూటమి అభ్యర్ధులే విజయం సాధించారు.అలాంటి విశాఖపట్నం జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడం చర్యనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో విశాఖ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యేల పేర్లు ఫోకస్ అయినప్పటికీ.. ఎవరికీ కేబినెట్ బెర్త్ దక్కలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ నుంచి విజయం సాధించారు .. వారెవరెరికీ మంత్రి పదవులు దక్కకపోవడంతో విశాఖపట్నం ఎంపీగా గెలిచిన మతుకుమిల్లి భరత్ ఇప్పుడు కూటమి సర్కారులో హైలెట్ అవుతూ అందరికీ అందుబాటులో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఎంపీ భరత్ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు స్వయానా అల్లుడు. బాలయ్య చిన్న కుమార్తె తెజస్వినిని భరత్ వివాహం చేసుకున్నారు. అలా ఏపీ మంత్రి నారా లోకేష్‌కి తోడల్లుడు అయ్యారు. నారా లోకేష్ తోడల్లుడు అంటే ఇక చంద్రబాబుతో ఎలాంటి బంధుత్వమో చెప్పనవసరం. విశాఖ ఎంపీగా భరత్‌కు మామ బాలకృష్ణ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ల అండదండలు ఎలాగో ఉన్నాయి. మరోవైపు మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడిగా రాజకీయ నేపధ్యం ఉన్న భరత్ గీతం విద్యాసంస్థల అధినేతగా అధినేతగా అందరికీ సుపరిచుతులే. అదీకాక పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటారు. 2019 ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైన ఆయన అప్పటి నుంచి అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ మొన్నటి ఎన్నికల్లో 5 లక్షల పైచిలుకు రికార్డ్ మెజార్టీతో ఎంపీగా గెలిచారు.దాంతో సహజంగానే భరత్ విశాఖ జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా మారారు. రాష్ట్రంలోనే 95 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కుతుందని భావించినా సమీకరణలు కలిసి రాలేదు. దాంతో ఆయన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు. రాష్ట్ర వ్యవహారాలకు పరిమితం అవ్వడంతో భరత్‌కు స్థానికంగా ప్రాధాన్యత పెరుగుతుంది. ఇక రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన భీమిలి ఎమ్మెల్యే , మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పదవుల కోసం పార్టీ మారతారన్న పేరుంది. అదీకాక ఆయన వియ్యంకుడు నారాయణకు మంత్రి పదవి దక్కిడం కూడా గంటాకు ఛాన్స్ లేకుండా చేసిందంట.ఈ సారి మంత్రి వర్గ కూర్పులో చంద్రబాబు పార్టీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు .. కనీసం మరో 15 ఏళ్లు రాజకీయం చేయగల నేతలకే ఎక్కువగా పదవులు కట్టబెట్టారు. అందుకే విశాఖ నుంచి వరుసగా గెలుస్తున్న ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టారు. ఆ క్రమంలో సీనియర్లలో ఒకింత అసంతృప్తి కనిపిస్తున్నప్పటికీ జిల్లాలో భరత్ చూపిస్తున్న చొరవ పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోందంట. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం లో ఎలాంటి కార్యక్రమం జరిగినా అందరూ భరత్‌కే ప్రయారిటీ ఇస్తున్నారట. అది ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదంటున్నారు. ఆ క్రమంలో విశాఖ టీడీపీలో భరత్ సూపర్ పవర్‌గా మారుతున్నారన్న టాక్ వినిపిస్తుంది.నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించే చాలా కార్యక్రమాల్లో కూడ భరత్ చొరవగా పాల్గొంటున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలలో తానే స్వయంగా చేసేసుకుంటున్నారు. ఎంపీ హాజరయ్యే ఏ కార్యక్రమానికి దాదాపుగా గంటా శ్రీనివాసరావు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు ఎంపీ కార్యక్రమంలో పాల్గొంటే మాత్రం గంటా శ్రీనివాసరావు అటువైపు ఓ చూపు చూస్తున్నారు. లేకపోతే గంట ఎంపీ భరత్ కార్యక్రమాలను దాదాపుగా బాయికాట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది.వైజాగ్ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు నాయకులు సహకరించినా, సహకరించకపోయినా భరత్ మాత్రం అందరికీ అందుబాటులో ఉంటూ ఎంపీగా తన పని తాను చేసుకుపోతున్నారు. పార్టీ బలాన్ని కాపాడుకుంటూనే, అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలో భరత్‌ను హైలెట్ చేయడానికే జిల్లాలో ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదన్న ప్రచారానికి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన ఎంపీగా గెలిచి 4 నెలలే అవుతుంది. మున్ముందు ఆయన స్పీడ్ ఎలా ఉంటుందో.. పార్టీలో ఎంత కీలకంగా తయారవుతారో చూడాలి.