సిరా న్యూస్,నెల్లూరు;
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం దూకుడు పెంచుతోంది… గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్ల చుట్టూ ఉచ్చు బిగించిన సర్కార్… ఆయా కేసుల్లో నిందితుల అరెస్టు దిశగా అడుగులు వేస్తోంది. అందరూ రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులే కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ ఎక్కువవుతోంది. ఇంతవరకు టీడీపీ కార్యాలయాలు, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లోనే అరెస్టుల వరకు వెళ్లిన సర్కార్… ఇప్పుడు కుంభకోణాల తుట్టె కదపడంతో ఎవరెవరు అరెస్టు అవుతారనే ఉత్కంఠ పెరుగుతోంది.ముఖ్యంగా లిక్కర్ కేసులో బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి.. ఇసుక, మైనింగ్ అక్రమాల్లో గనులశాఖ రిటైర్డ్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి టార్గెట్‌గా అడుగులు వేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేయగా, ఏ క్షణమైనా ఇద్దరినీ అరెస్టు చేయొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇసుక మైనింగ్‌లో 2 వేల 500 కోట్ల అవినీతి జరిగిందని వెంకట్‌రెడ్డిపై తాజాగా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు… ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారుల అదుపులోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను అరెస్టు చేసినట్లు అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు? అంతవరకు ఆయన వద్ద ఏ కూపీ లాగుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, నేతలు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు.ఇలా అవినీతి కేసుల్లో ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను టార్గెట్ చేసిన ప్రభుత్వం.. మరోవైపు బెజవాడ క్రైం స్టోరీపైనా సీరియస్‌గా ఫోకస్ చేసింది. ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధింపులకు గురి చేశారని ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై కేసులు నమోదు చేశారు విజయవాడ పోలీసులు. ఈ కేసులో దిగువస్థాయి అధికారులైన ఇన్‌స్పెక్టర్లు, ఆ కింద స్థాయి అధికారులు అప్రూవర్‌లుగా మారడంతో ముగ్గురు ఐపీఎస్‌లకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఐపీఎస్‌లపై చర్యలు తీసుకోవాలంటే చాలా ప్రోసీజర్ పాటించాల్సి వుంటుంది. ఆల్ ఇండియా సర్వీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. దీంతో ఐపీఎస్‌లకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరిస్తోందట ప్రభుత్వం. బాధితురాలు కాదంబరి జెత్వాని ఫిర్యాదు తర్వాత కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు.. మధ్యలో విజయవాడ వరదల వల్ల కొంత బ్రేక్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో కేసు దర్యాప్తులో వేగం పెంచినట్లు సమాచారం.ఇప్పటికే రెండు సార్లు బాధితురాలు కాదంబరి జెత్వానీ నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు… ఐపీఎస్‌లకు వ్యతిరేకంగా కీలక సాక్ష్యాధారాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. బాధితురాలికి వ్యతిరేకంగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2న కేసు పెట్టగా, బాధితురాలిని అరెస్టుకు వెళ్లే అధికారుల కోసం అప్పటికి ఒక రోజు ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసినట్లు తాజాగా గుర్తించారు పోలీసులు. దీంతో కుట్ర ప్రకారమే బాధితురాలిని అరెస్టు చేసేందుకు ఐపీఎస్ అధికారులు ప్రణాళిక రచించారని అనుమానిస్తోంది ప్రభుత్వం. ఈ ఆధారాలతో ఐపీఎస్‌లపై వేటు వేసేందుకు ఫైల్ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు తవ్వి తీస్తుండటం వల్ల.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యహరించిన అధికారులు హడలిపోతున్నారు. ప్రభుత్వ టార్గెట్‌లో ఉన్న అధికారుల వల్ల ఎవరికి ముప్పు వాటిల్లుతుందోననే టెన్షన్ పడుతున్నారు. ఒకరిద్దరిని లక్ష్యం చేసుకుని కేసులు పెట్టినా.. ఆ ఇష్యూతో సంబంధం లేని వారు కూడా ఇరుక్కుపోయే ప్రమాదం ఉండటంతో దిగువస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అటు వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశాలను సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ అడుగులన్నీ తమను ఇరికించేందుకే అన్న అనుమానంతో ఉన్న నేతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఒక దాని తర్వాత ఒకటిగా నమోదు చేస్తున్న కేసులతో ఇప్పటికే కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపు 90 రోజులుగా బయట ప్రపంచానికి కనిపించకుండా తిరుగుతున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి జోగి రమేశ్, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ కూడా అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయారు. జోగి రమేశ్, అవినాశ్‌కు సుప్రీం తాత్కాలిక ఉపశమనం కల్పించినప్పటికీ, వారు ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గమనిస్తే ముందుగా అధికారులను బుక్ చేసి ఆ తర్వాత నేతలను మూసేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది.